సాంకేతికతతో అనుసంధానం చేయాలి..
Ens Balu
2
Srikakulam
2020-10-24 14:19:49
సాంకేతికతతో అనుసంధానం కావడం ద్వారా పోలీసు వ్యవస్థలో సుపరిపాలన సాధ్యం కాగలదని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జాతి నిర్మాణంలో పోలీసు పాత్ర అనే అంశంపై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతి నిర్మాణంలో పోలీసు పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయడం ద్వారా స్పూర్తిదాయక సేవలు అందించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. సామాన్య మానవుని సంతృప్తి మేరకు పనిచేయడమే గొప్ప జాతి నిర్మాణం కాగలదని చెప్పారు. 1947 నుండి పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. సమాజంలో సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పరిగణనలోకి తీసుకొని మార్పులు తీసుకురావలసి ఉంటుందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వలన వ్యవస్థ బలోపేతం కాగలదని చెప్పారు. జనాభాకు అనుగుణంగా పోలీసు సంఖ్య ఉండడం ద్వారా వేగవంతమైన, ఉత్తమమైన సేవలు అందించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. శాంతిభద్రతల అమలు చేసే శాఖగా అంకిత భావం, చిత్తశుద్ధి అవసరం అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని గుర్తించాలని సూచించారు. పోలీసు వ్యవస్థ బలోపేతం చేయడంలో భాగంగా ప్రజల సహకారం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిలో ఉన్నత విద్యలు కలిగిన వారు ఉండటం శుభసూచకమన్నారు. తద్వారా ఎదుటి వ్యక్తులను అర్ధం చేసుకోగలరని పేర్కొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడంలో స్నేహపూర్వక వాతావరణంలో పోలీసు పనితీరు ఉండాలని సూచించారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో త్వరలో మరిన్ని మంచి విధానాలు రానున్నాయని వివరించారు. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించి, ప్రజల నుంచి మన్ననలు పొందారని అన్నారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పప్పుల జగన్నాథ రావు మాట్లాడుతూ ఎఫెక్టివ్ పోలీసింగ్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. తద్వారా పోలీసులు శాంతిభద్రతల అమలులో మరింత బలోపేతం కాగలదని అన్నారు.
మార్పు కార్యక్రమం ప్రత్యేక అధికారి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.రజనీకాంత రావు మాట్లాడుతూ సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో 72 మంది పోలీసులు ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. విద్యావిషయ నిపుణులు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై అవగాహనకు ప్రాధమిక స్థాయి నుండి సిలబస్ లో చేర్చాలన్నారు. డిఎస్పీలు డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాల్లో ప్రభలే అశాంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, యువతను మంచిదారిలో నడిపించడం వలన వ్యవస్థ బలోపేతం కాగలదని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు, ఇటీవల మృతి చెందిన జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు పి.సోమ శేఖర్, కె.శ్రీనివాసరావు, విద్యావిషయ నిపుణులు సురంగి మోహన్ రావు,డిఎస్పీ సి.హెచ్.జి.వి ప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.