కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..


Ens Balu
2
జివిఎంసి కార్యాలయం
2020-10-26 21:00:27

మహానగరపాలక సంస్థ పరిధిలోని ప్రార్ధనా మందిరాల మత పెద్దలు కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు అన్నారు. సోమవారం జివిఎంసి సమావేశ మందిరంలో వివిధ ప్రార్ధనా మందిరముల మతపెద్దలు, ఆలయ ధర్మకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మీ ప్రార్ధనా మందిరాలకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకొని లోనికి అనుమతి ఇవ్వాలన్నారు. ఆలయాలలో “క్యూ” లైనులో ఉన్న భక్తులు భౌతికదూరం పాటించేవిధంగా ఆలయ ధర్మకర్తలను ఆదేశించారు.  మాస్క్ ఉంటేనే లోనికి అనుమతించాలని లేదంటే బయటకు పంపివేయాలన్నారు. ధర్మల్ స్క్రీనింగ్ లేకుండా భక్తులను అనుమతించకూడదన్నారు. ప్రధాన గేటు వద్ద కోవిడ్ నివారణకి సంబందించిన బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రార్ధనా మందిరంలో వాటర్ ట్యాప్ వద్ద సబ్బులు ఉంచాలని, ప్రతీ గంటకు ఒక్కసారి సోడియం హైపో క్లోరేట్ తో పిచికారీ చేయాలని, దగ్గు, జ్వరం, ఆయాసం ఉన్న భక్తులు వస్తే వారిని గుర్తించి లోనికి అనుమతించరాదన్నారు. ఇతర దేశాల నుండి వచ్చే భక్తులను 14 రోజుల పాటు ఆలయాలలోకి అనుమతి నిషేదించాలన్నారు. మీ మాట తూ.చ. తప్పకుండా భక్తులు వింటారు కాబట్టి మీరు కూడా మీ మందిరాలకు వచ్చే వారికి కోవిడ్ పై అవగాహన కల్పించాలన్నారు. ప్రార్ధనా మందిరాలలోని క్యూ లైనులో ఉమ్మడం వేయకుండా చూడాలన్నారు. అనంతరం జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే.ఎస్.ఎల్.జి.శాస్త్రి మాట్లాడుతూ కరోనా  చాలావరకు తగ్గిందని, అయినా పూర్తిగా తొలగిపోలేదని రెండవసారి మొదలైతే చాలా తీవ్రంగా ఉంటుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పై ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన విశాఖలో చాలా మందిరాలలో  కోడి నిబంధనలు సంతృప్తినిస్తున్నాయన్నారు. దేవాలయాల్లోనూ  కళ్యాణకట్ట భక్తులకు కేటాయించే గదులు, బాత్రూములు మొదలైన చోట్ల సోడియం హైపో క్లోరైడ్ తో శుభ్రపరచాలన్నారు.