నిర్లక్ష్యం వలనే కరోనా రెట్టింపు..


Ens Balu
2
Srikakulam
2020-10-27 14:13:17

శ్రీకాకుళం జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసులు రెట్టింపు అయ్యే అవకాశముందని వైద్య నిపుణలు తెలియజేస్తున్నారని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లాలోని దేవాలయాలు, చర్చ్, మశీదుల మత పెద్దలతో కరోనా నియంత్రణపై అవగాహన కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గాయని, అయినప్పటికీ ఇది సంతోషించదగ్గ విషయం కాదని అన్నారు. స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని స్పష్టం చేసారు. రానున్నది చలికాలం కావడంతో ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరిస్తూ, శానిటైజేషన్ తో చేతులను తరచూ శుభ్రపరచుకోవడం వలన కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లాలో కరోనా పేషెంట్ల కొరకు ప్రభుత్వ ఆసుపత్రులలో 2000 బెడ్లు ఉండగా ప్రస్తుతం 100 మంది మాత్రమే ఉన్నారని, ప్రైవేట్ ఆసుపత్రులలో 3000 బెడ్లు ఉండగా ప్రస్తుతం 150 మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పేషెంట్ల సంఖ్యను మరింత తగ్గే విధంగా జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలో బెడ్లకు గాని, టెస్టులకు గాని కొరతలేదని, రాష్ట్రంలో ఎక్కువగా టెస్టులు చేసే అవకాశం మన జిల్లాలో ఉందని అన్నారు. జిల్లాలో 15500 మంది వార్డు, గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నారని, ఈ వాలంటీర్ల ద్వారా ప్రతీ 50 గృహాలకు వెళ్లి కరోనా కేసుల వివరాలను సేకరించడం జరుగుతుందని జె.సి వివరించారు. వీటితో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలయిన దేవాలయాలు, చర్చ్, మశీదులకు విచ్చేసే భక్తులు తప్పనిసరిగా మాస్కులను వినియోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ శానిటైజేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జె.సి మత పెద్దలను కోరారు. ఇప్పటివరకు జిల్లా ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించడం వలనే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, భవిష్యత్తులో కూడా ప్రజలు సహకారాలు అందించి పూర్తిగా కరోనా నియంత్రణకు తోడ్పాటును అందించాలని జె.సి ఈ సందర్భంగా కోరారు. అనంతరం మత పెద్దలు జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చిన మాస్కే కవచం  ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ కరోనా నివారణకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.    ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యం.అన్నపూర్ణమ్మ, శ్రీసూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాష్, ఇతర మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.