రైతుల శ్రేయస్సే ప్రధాన ధ్యేయం..


Ens Balu
4
Srikakulam
2020-10-27 14:38:21

రైతు శ్రేయస్సే ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం రెండవ విడత పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వై.యస్.ఆర్ రైతు భరోసా - పి. ఎం. కిసాన్ పథకం కింద రైతులకు, అర్హులైన కౌలు రైతులకు, సాగుదార్లకు ఏటా రూ. 13,500 చొప్పున, అయిదేళ్లలో రూ.67,500 అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. వై.యస్.ఆర్ రైతు భరోసా - పి. ఎం. కిసాన్ పథకం క్రింద మొదట విడతగా - ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500; రెండో విడతగా అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకైనా/రబీ అవసరాలకైనా రూ. 4000; మూడో విడతగా - ధాన్యం ఇంటికి చేరేవేళ, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 ఇస్తున్నామని చెప్పారు. 2019-20 సంవత్సరములో రాష్ట్రములో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,534 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగిందని, 2020-21 సంవత్సరంలో మొదటి విడతగా రాష్ట్రములో 49.44 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,675 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో రెండవ విడతగా రాష్ట్రములో 50.47 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,991 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల వరదలకు నష్టపోయిన పంటలకు గాను 1.66 లక్షల మంది రైతులకు  రూ.135.73 కోట్లను రైతు భరోసా రెండవ విడతతోనే పంపిణీ చేస్తున్నామని, నష్టపోయిన సీజన్ లోనే నష్టపరిహారం అందించడం దేశ చరిత్రలోనే మొదటిసారి అన్నారు.   జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ 2019-20 సంవత్సరములో  శ్రీకాకుళం జిల్లాలో 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో మొదట విడతలో  శ్రీకాకుళం జిల్లాలో 3.64 లక్షల రైతు కుటుంబాలకు రూ. 273 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో రెండవ విడతలో జిల్లాలో 3.68 లక్షల రైతు కుటుంబాలకు రూ.150 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. ఈ 150 కోట్లలో, 71 కోట్లు పీ.యమ్.కిసాన్ కింద జమ చేయడం జరిగిందని, మంగళవారం వై.యస్.ఆర్ రైతు భరోసా కింద రూ. 79 కోట్లు రైతులకు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో రెండు విడతలలో రాష్ట్రములో 49.78 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,666 కోట్ల మొత్తాన్ని జమ చేయగా, శ్రీకాకుళం జిల్లాలో 3.68 లక్షల రైతు కుటుంబాలకు రూ.423 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందని వివరించారు. కరోనా సమయంలో రైతు భరోసా మొత్తాలు జమ కావడంతో రైతులు సంతోషం గా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది అదనంగా 34 వేల మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.       ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీకి చెందిన  రైతు అల్లు సూర్యనారాయణ మాట్లాడుతూ రైతు భరోసా మొత్తాన్ని సకాలంలో అందించి ఆదుకుంటున్నారని ప్రశంసించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ముదావహం అన్నారు. పరీక్షించిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ఇ క్రాప్ బుకింగ్ పెట్టడం రైతులకు వరం అన్నారు. ఆర్.బి.కే పరిధిలో కస్టమర్ హాయరింగ్ కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు.  వై. యస్.ఆర్ జలకళ కార్యక్రమం ఏర్పాటు చేసి సాగునీరు కూడా అందిస్తున్నారని దీనితో రైతుల పరిస్థితి మారుతుందని చెప్పారు. వ్యవసాయ సహాయకులు మంచి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, కాపు, కళింగ కోమటి కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, ఉప సంచాలకులు రాబర్ట్ పాల్, ఏపిఎం.ఐ.పి పిడి ఏ.వి.ఎస్.వి.జమదగ్ని, సహాయ పిడి టివివి ప్రసాద్, వ్యవసాయ ఏడిలు ఆర్.రవి ప్రకాష్, శ్రీనివాస్, వై.సురేష్., జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.