ప్రజాసేవకు రియల్ పోలీస్ మనసు పెడితే..
Ens Balu
3
తిరుపతి అర్భన్
2020-10-28 21:01:50
ఒంటిపై ఖాకీ చొక్క ఉంటే చాలు ఎవరినైనా అరేయ్..ఒరేయ్...ఏరా.. అని ఎంతో మర్యాదగా పిలుస్తారు పోలీసులు...అలాంటి వారంతా ఒక్కసారి తిరుపతి అర్బన్ ఎస్పీ ఎ.రమేష్ రెడ్డిని చూసినా, ఆయన చేసిన పనుల కోసం తెలుసుకున్నా ఖచ్చితంగా మార్పువచ్చితీరుతుంది. అంతలా విధి నిర్వహణ చేస్తూ..ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతన ఒరవడిని స్రుష్టిస్తున్నారు. పోలీసులు మనసు పెట్టి పనిచేస్తే ఫలితాలు ఇంతలా వస్తాయా అనేవిధంగా వ్యవహరిస్తున్నారు. డిజిపి ఆదేశాల మేరకు తిరుపతి అర్భన్ లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహించిన కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అందించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆ సమయంలో కూడా ఒక ఎస్పీ అయివుండి ఎంతో వినమ్రంగా చేతులు రెండూ దండకట్టుకొని మరీ శ్రద్ధగా తప్పిపోయిన బాలల నుంచి వివరాలు సేకరించి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అలా చేయడంతో ఇప్పటి వరకూ ఏకంగా 77 మంది బాలలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చగలిగారు. తిరుపతి అర్భన్ జిల్లాలో చేసే ఏ కార్యక్రమం అయినా దానిని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసి చైతన్యం తీసుకువస్తున్నారు. ఫేస్ బుక్ అనేసరికి అంతా ప్రచారం కోసం అనుకుంటారు. కానే కాదనే విషయం ఈ ఎస్పీని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ అంటే ప్రజల్లో ఒక ఉన్నత గౌరవాన్ని నింపేందుకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందనే సూత్రాన్ని అమలు చేస్తూ, ప్రజాపోలీసింగ్ అందిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎన్జీఓలను కూడా భాగస్వాములు చేస్తూ తప్పిపోయిన పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించి మరీ వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు. ఐపీఎస్ అంటే హోదా కాదు.. ఒక బాధ్యత అని మాటలు చెప్పకుండా వస్తాయనడానికి ఈ సూపర్ ఐపీఎస్ రాష్ట్రంలో మచ్చుతునకలా కనిపిస్తున్నారు. అదేసమయంలో అవినీతిని ఎండగట్టడంలోనూ ఎల్లప్పుడూ ముందుంటూ పోలీస్ శాఖలో మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి అధికారులు ప్రతీ జిల్లాలోనూ ఉంటే పోలీసులంటే మనసులో అమ్మనాభూతులు తిట్టుకుంటూనే బయటకు గౌరవాన్ని నటించే పరిస్తితిపోయి...నిజంగానే మనసునిండిన భావంతో గౌరవించే రోజులొస్తాయనిపించేలా వ్యవహరిస్తున్నారు రమేష్ రెడ్డి...