ప్రమాదాల నియంత్రణకు సాంకేతికత..
Ens Balu
3
Srikakulam
2020-10-29 14:52:44
రాష్ట్రంలో ప్రమాదాలు జరుగకుండా సాంకేతికత వినియోగంచుటకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఉత్తరాంధ్ర తొలి పర్యటనలో భాగంగా గురు వారం శ్రీకాకుళం విచ్చేసిన హోమ్ మంత్రి శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద గల అగ్నిమాపక కేంద్రంకు రూ.48.50 లక్షలతో మొదటి అంతస్తుపై అదనంగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజులతోకలసి సుచరిత ప్రారంభించారు. అగ్నిమాపక యంత్ర పరికరాలను పరిశీలించారు. నూతన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో 185 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని వాటిలో 12 అగ్నిమాపక కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 207 ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఇందులో రూ.2.07 కోట్ల విలువ గల ఆస్తి నష్టం జరుగగా, రూ.10.81 కోట్ల విలువ మేరకు ఆస్తులను కాపాడటం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా, 17 మందిని ప్రాణాలతో రక్షించడం జరిగిందని ఆమె వివరించారు. తుఫానులు, విపత్తుల సమయంలో విపత్తులు, అగ్నిమాపక శాఖ నిర్విరామంగా కృషి చేస్తుందని, ప్రాణ నష్టం జరుగకుండా అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. తితిలి తుఫాను సమయంలో 22 రోజుల పాటు నిరంతరం సేవలు అందించారని పేర్కొన్నారు. ఇటీవల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ తదితర జిల్లాల్లో సంభవించిన వరదలలో సకాలంలో అగ్నిమాపక, విపత్తుల సిబ్బంది సేవలు అందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టారని అన్నారు. మనుషులతోపాటు పశువులను కూడా సురక్షితంగా ఉండుటకు చర్యలు చేపట్టడం ముదావహం అన్నారు. ఆపద సమయంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించుటకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కేరళ, హైదరాబాదు వరదల్లో సహాయ కార్యక్రమాల్లో మన రాష్ట్ర సిబ్బంది పాల్గొని అత్తుత్తమ సేవలు అందించారని మంత్రి తెలిపారు.
దేశ వ్యాప్తంగా పోలీసు శాఖ మంచి సేవలు అందించడంలో మంచి గుర్తింపు పొందిందని పేర్కొంటూ జాతీయ స్ధాయిలో 83 అవార్డులు ప్రకటించగా 48 అవార్డులు మన రాష్ట్రానికి దక్కాయని తెలిపారు. దిశ పోలీసు స్టేషన్లకు 5 అవార్డులు దక్కాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఏపి పోలీసు సేవలకు మొత్తంగా 85 అవార్డులు రావడం జరిగిందని, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం జరుగుతోందని అన్నారు. చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నామని సుచరిత చెప్పారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన సహాయ జిల్లా అగ్నిమాపక అధికారులు బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, కె.శ్రీనుబాబు, లీడింగ్ ఫైర్ మెన్ దుర్గా రెడ్డి, పైర్ మెన్ పి.రాంబాబు, రాజశేఖర్, డ్రైవర్ పి.చక్రధర్ లకు ప్రశాంసా పత్రాలను మంత్రి అందజేసారు. అతిధులకు అగ్నిమాపక మహా సంచాలకులు (డైరక్టర్ జనరల్) మహమ్మద్ హసన్ రెజా దుశ్సాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. అగ్నిమాపక శాఖలో హోమ్ గార్డుగా పనిచేస్తూ రహదారి ప్రమాదంలో మరణించిన సింహాద్రి నాయుడు కుటుంబ సభ్యులకు అగ్నిమాపక సిబ్బంది విరాళాలుగా అందించిన రూ.3,43,250 మొత్తాన్ని మంత్రి సుచరిత అందజేసారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, తూర్పు కాపు, కాళింగ కార్పొరేషన్ ల ఛైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, అగ్నిమాపక శాఖ సంచాలకులు కె.జయరాం నాయక్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జి.శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, ఏపి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ కార్యనిర్వాహక ఇంజనీరు కె.తమ్మిరెడ్డి., మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి., దువ్వాడ శ్రీనివాస్,సురంగి మోహన రావు, పి.రుషి తదితరులు పాల్గొన్నారు.