ఆధునికి టెక్నాలజీ వినియోగించుకోవాలి..
Ens Balu
4
Vizianagaram
2020-10-29 18:35:00
రాష్ట్ర పోలీసు శాఖ ఆధునిక టెక్నాలజీతో కూడిన సేవలు అందిస్తోందని ప్రజలు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోను ద్వారానే ఈ సేవలు వినియోగించుకోవచ్చని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఏ.పి.పోలీసు సేవ యాప్ ద్వారా 87 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నామని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషనుకే వెళ్లాల్సిన పనిలేదని, తమ మొబైల్ ఫోనులోని యాప్ ద్వారా ఎంతో సులువుగా ఫిర్యాదు చేయవచ్చని, కేసులను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇటువంటి సేవలను రాష్ట్ర ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర పోలీసుల పనితీరుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని హోం మంత్రి పేర్కొన్నారు. స్కోచ్ సంస్థ 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటిస్తే అందులో 48 అవార్డులు మన రాష్ట్ర పోలీసు శాఖకు లభించడం ఈ శాఖ పనితీరుకు నిదర్శమని, ఇందుకు చాలా గర్వంగా వుందన్నారు. జిల్లా పర్యటనకోసం గురువారం నగరానికి వచ్చిన హోంమంత్రి స్థానిక జిల్లాపరిషత్ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం, దిశ చట్టం తీసుకురావడం, దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటు ద్వారా పోలీసు శాఖకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. మహిళల భద్రతకు తీసుకువచ్చిన దిశ చట్టంలో భాగంగా ప్రాంతీయ ఫోరెన్సిక్ లేబొరేటరీలు విశాఖ, తిరుపతి, విజయవాడల్లో త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. దిశ చట్టంలో భాగంగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటులో ఎలాంటి సమస్యలేదని వాటిని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు ట్రైనింగ్ కళాశాల వుండేదని అయితే అది లేకపోవడం వల్ల ప్రస్తుతం అనంతపూర్‌లో తాత్కాలికంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పోలీసు ట్రైనింగ్ కళాశాల ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఇతర రాష్ట్రాల్లో సైతం సేవలందిస్తూ అక్కడి ముఖ్యమంత్రుల ప్రశంసలు కూడా పొందుతోందని హోం మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 175 అగ్నిమాపక కేంద్రాల ద్వారా విపత్తులు, అగ్నిప్రమాదాల సమయంలో సేవలందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేసినపుడు అన్ని పార్టీల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని హోం మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో నాడు 26 కోవిడ్ కేసులు ఉన్నపుడు ఎన్నికలు వాయిదా వేసి 27వేలకు పైగా కేసులున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహణ చేపడతామనడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. పత్రికా విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, శాసన మండలి సభ్యులు సురేష్‌బాబు, శాసనసభ్యులు అలజంగి జోగారావు, శంబంగి చినప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీకాకుళం నుండి జిల్లాపరిషత్ అతిథిగృహానికి చేరుకున్న హోం మంత్రికి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, శాసనసభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, జిల్లా ఎస్.పి. బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ. భవానీశంకర్, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు తదితరులు స్వాగతం పలికారు. పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు తదితరులు హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. హోం మంత్రి వెంట పర్యటనలో విపత్తు నిర్వహణ శాఖ డైరక్టర్ జనరల్ మహమ్మద్ హసన్ రెజా కూడా ఉన్నారు.