పండుగలా వాల్మీకి జయంతి..
Ens Balu
3
క్రిష్ణాజిల్లా
2020-10-29 18:43:18
మహర్షి వాల్మీకి జయంతిని అక్టోబరు 31న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారిక ఉత్సవంగా వాల్మీకి జయంతిని జరుపుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ పరిధిలోని డివిజనల్, మండల, పంచాయతీ, గ్రామ స్థాయి కార్యాలయాల్లో ఈ ఉత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేశామన్న కలెక్టర్ ఎవరు కార్యక్రమం నిర్వహించకపోయినా చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను అన్ని శాఖల అధికారులు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించాలన్నారు. కార్యక్రమ నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు.