రివ్యూ సమావేశానికి సిద్ధం కావాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-29 20:56:23

అనంతపురం జిల్లాలో వచ్చే నెల నవంబర్ 2వ తేదీన జిల్లా రివ్యూ కమిటీ సమావేశం (డిఆర్సీ) జరుగుతుందని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమగ్రమైన సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో డిఆర్సీ సమావేశం నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి పురోగతిపై   ప్రతి శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను  10 స్లైడ్స్ మించకుండా రూపొందించాలన్నారు.  ఆయా శాఖల పరిధిలో అమలయ్యే పథకాల అమలు, గైడ్ లైన్స్, పురోగతి, ఎప్పటి లోపు పనులు పూర్తి, పురోగతి లేకపోతే ఎందుకు వెనుకబడి ఉన్నాం అన్న వివరాలతో ప్రజంటేషన్ ఉండాలని, ఆ అంశాలపై  అన్ని శాఖల అధికారులకు పూర్తి స్పష్టత ఉండాలన్నారు. ప్రతి శాఖ పరిధిలోనూ కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, క్షేత్ర స్థాయిలో ఆయా పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, పథకాల అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము ఇలాంటి అన్ని రకాల వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇరిగేషన్ పరిధిలోని ట్యాంకులకు నీటిని సరఫరా, వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలు, దెబ్బతిన్న రహదారుల వివరాలు, ఇసుక, సిమెంట్ సరఫరా, సీజనల్ వ్యాధులు, అంగన్వాడీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు,  వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం, నాడు నేడు పనుల పురోగతి, కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న కట్టడి చర్యలు, తదితర అన్ని  ప్రభుత్వ పథకాల అమలు, వాటి పురోగతిపై అన్ని వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.  అనంతరం జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల నివేదికల పై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ వార్డు సచివాలయ లు మరియు అభివృద్ధి) ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నిషా0తి, డిఆర్ఓ గాయత్రీదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.