కోవిడ్ నిబంధనల మేరకే అవతరణ దినోత్సవం..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-29 21:31:51
ఆంధ్రప్రదేశ్ లో ప‌్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించే వేడుకల్లో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది జరిగిన అభివృద్ధిపై ఫోటో ప్రదర్శన, జిల్లాలో తయారైన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, మహారాజా సంగీత, నృత్య కళాశాల విద్యార్ధులచే పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ముఖ్యఅతిథిచే జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వక్తల సందేశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, విపత్తు నిర్వహణ విభాగం ప్రోగ్రాం మేనేజర్ పద్మావతి, మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.