సమాచారం అందగానే సహాయక చర్యలు..


Ens Balu
3
Vizianagaram
2020-10-29 21:35:31

విపత్తు సమాచారం అందగానే తక్కువ సమయంలోనే హాజరై ప్రాణాపాయం, ధన నష్టం నుండి కాపాడుటలో అగ్నిమాపక సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని రాష్ట్ర హోం , విపత్తుల శాఖామాత్యులు మేకతోటి సుచరిత అన్నారు.  సహాయక చర్యల్లో ఆధునిక పనిముట్లను వినియోగించి, సాంకేతికతను జోడించి ఉత్తమ ప్రమాణాలతో పని చేస్తున్నారని కొనియాడారు.  ప్రతి 50 వేలమందికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే డిమాండ్ ఉందని, భవిష్యత్ లో వీలున్నంత ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని చెప్పారు.  గురువారం హోం శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణితో కలిసి శృంగవరపుకోట, కొత్తవలసలలో ఒక్కొక్కటి రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన  అగ్నిమాపక కేంద్రాలను  ప్రారంభించారు.  అనంతరం  హోమ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు చేపట్టడం ద్వారా గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.  సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలతో  గ్రామ స్వరాజ్యం సాధ్యం చేసి నిరూపించారు.  మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం చేయడమే కాక మేనిఫెస్టో లో చెప్పిన అంశాలను 90 శాతం అమలుచేసి జనరంజకంగా అభివృద్దిని చేసి చూపించారని అన్నారు.  సభాద్యక్షత వహించిన శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యదక్షతకు మారుపేరుగా ముఖ్యమంత్రి నిలిచారని, 14 నెలల ఆయన పాలన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.  గత ప్రభుత్వ బకాయిలను తీర్చడమే కాక రైతులు, మహిళలు, పిల్లల పట్ల పెద్ద దిక్కుగా నిలిచారన్నారు.  కరోనా కాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని జయించిన ముఖ్యమంత్రిగా దేశంలో నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యులు అలజంగి జోగారావు, రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డైరక్టర్ జనరల్ మహమ్మద్ అహసన్ రెజా, జిల్లా ఎస్పి  బి.రాజకుమారి, సంయుక్త కలక్టరు  డా. జి.సి. కిషోర్ కుమార్, అగ్నిమాపక శాఖ సంచాలకులు కె. జయరామ్ నాయక్, రీజనల్  ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారులు మోహనరావు, వర ప్రసాద్,రామునాయుడు, ఆర్డిఓ భవానిశంకర్, ఆయా మండలాల తహశీల్ధార్లు, ఎంపిడిఓలు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.