సహకార సంఘాలను బలోపేతం చేయాలి..


Ens Balu
7
Srikakulam
2020-10-30 16:22:53

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సహకార సంఘాల ను పరిపుష్టం చేయాల్సి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి.ఏ.సి.ఎస్) మొదటి అంతస్తు నూతన భవనాన్ని ఉప ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు.   వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బలమైన సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత రంగాలలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఉన్నాయని తెలిపారు. సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది కస్టమ్ హైరింగ్ సెంటర్ లు, కస్టమ్ హైరింగ్ హబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్.బి.కే లో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని, రూ.15 లక్షల వరకు విలువ చేసే వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు. వీటిని అద్దె ప్రాతిపదికన రైతులకి అందజేస్తామని తెలిపారు. రైతులు కూలీల కొరత సమస్య నుంచి బయటపడవచ్చని సూచించారు. ఈ యంత్రాలు కొనుగోలు చేసేందుకు డిసిసిబి ఆర్ధిక సహాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అద్దెకు పరికరాలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంకు రుణం చెల్లింపు పూర్తి అయిన తర్వాత సహకార సంఘానికి ఆ యంత్రాలు సొంతం అవుతాయని అన్నారు. కస్టమ్ హైరింగ్ హబ్ లో కోటి విలువైన భారీ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని అద్దెకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.  నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి అల్లాడ సొసైటీకి హబ్ అందుబాటులో ఉందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్ పథకంలో భాగంగా రైతులకు గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ లు, భూసార పరీక్షలు చేసే ల్యాబ్ లు నిర్మించేందుకు అనుమతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నాబార్డు ద్వారా వీటిని మంజూరు చేయడమే కాకుండా రుణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారని చెప్పారు. డిసిసిబి ద్వారా జిల్లాలోని పిఎసిఎస్ నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో 120 కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయితే ప్రజా ప్రతినిధులు సచివాలయం ద్వారా పాలనను సమన్వయం చేసుకుంటారని వివరించారు. కరోనా కట్టడి అయిన తర్వాత  ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉండవచ్చని పేర్కొన్నారు. సారవకోట మండలంలో కెళ్లవలస - జమ చక్రం డబుల్ లైన్ రోడ్డునకు రూ.15 కోట్లు మంజూరు చేసామని, వడ్డేన వలస- కొమనాపల్లి రోడ్డు కూడా 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ తెలిపారు.   ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, సీఈఓ దత్తి సత్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ గెల్లంకి వెంకటరమణ, మాజీ ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, వరదు రాఘవ, చిన్నాల వెంకట సత్యనారాయణ, వైస్ చైర్మన్ నక్క తులసీదాస్, బాడన కృష్ణ, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.