దళితులు ఆర్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
1
Visakhapatnam
2020-10-30 16:48:36

 ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దళితులందరూ ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.  శుక్రవారం విశాఖపట్నం వెలంపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద డా. బి.ఆర్. అంభేథ్కర్ విగ్రహాన్ని  రాష్ట్ర  హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమం అల్ ఇండియా ఎస్సి, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంభేథ్కర్ వారసులమని గర్వముగా చెప్పుకుంటామని తెలిపారు.  ఈ రోజు దళితులు ఉద్యోగ, రాజకీయ రంగాలలో  రానిస్తున్నారంటే  అది ఆయన కృషి ఫలితమేనన్నారు.   భారత దేశంలో దళితులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారంటే అది ఆయన పెట్టిన భిక్ష మాత్రమేనన్నారు. ఆ మహానుభావుడి ఆలోచన స్పూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం రిజర్వేషన్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించినట్లు పేర్కొన్నారు.  ఎక్కడా లేని విధంగా ఒక దళిత మహిళకు హోంమంత్రి, గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవిని  ఇచ్చి ముఖ్యమంత్రి గౌరవించినట్లు చెప్పారు.   రాష్ట్రంలో దళితులందరూ ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.  నామినేటెడ్ పోస్ట్ లలో ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ 50 శాతం కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.  సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 65 వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళ ఖాతాల్లో వేయడం జరిగిందని, దళితులు పారిశ్రామికంగా ఎదగాలని నూతన పాలసీని కూడా తీసుకొచినట్లు పేర్కొన్నారు.  అంభేథ్కర్ ఆశయాలను నెరవేర్చడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిఅని చెప్పారు.   రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేథ్కర్ ఆశయాలను అందరం తప్పక పాటించాలన్నారు. అంబేథ్కర్ ఒక్క దళితులకే కాదు యావత్ దేశ ప్రజలకు పూజనీయులని పేర్కొన్నారు.  భారత దేశమే కాదు, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేథ్కర్ అని కొనియాడారు.  భారతదేశంలోని అందరు నాయకుల్లో బిఆర్ అంబేథ్కర్ అత్యుత్తమ మేధావని ఎప్పుడో గుర్తించినట్లు స్పష్టం చేశారు.  భారత ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ, హక్కులును పొందుతున్నామని అది ఆయన కృషి ఫలితమేనన్నారు.  అలాంటి మహనీయుని విగ్రహాలు ఊరి బయటకాదు, ఊరి నడిబొడ్డున ఉంచాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని ఖచ్చితంగా చెప్పాలన్నారు. అంబేథ్కర్ ఆశయాలను అమలుపరుస్తూ దళితుల అభివృద్థికి ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు రవీంద్రబాబు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, గొల్ల బాబురావు, ఎస్.సి., ఎస్.టి. పోస్టల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ సభ్యులు బి. యేసు, బి. వరప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.