కరోనా నియంత్రణకు మాస్కే రక్షణ..
Ens Balu
4
Anantapur
2020-10-30 20:39:28
కరోనా నివారణకు మాస్కే కవచం అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కోవిడ్ 19 నివారణపై ముమ్మర ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని టవర్ క్లాక్ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్యలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అన్నది ఇంకా ముగియలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కోవిడ్ 19 నివారణపై ముమ్మర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కరోనా వైరస్ నివారణ పై వివిధ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 62,500 మందికి పైగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారన్నారు. భవిష్యత్తులో కరోనా కేసులు ఇంకా తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తోపాటు కరోనా నివారణకు ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఎవరికి వారు వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. కరోనాను జిల్లాలో సాధ్యమైనంతవరకూ కట్టడి చేశామని, జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నేపథ్యంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందేందుకు అనేక నిధులు మంజూరు చేశారని, జిల్లా యంత్రాంగం తరఫున సమర్థవంతంగా మౌలిక వసతులను ఉపయోగించుకుని కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ. సిరి, ఇంచార్జ్ డిఎంఅండ్హెచ్ఓ పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఆర్డీవో భూషణ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.