ప్రజాసేవలో అలసత్వం క్షమించేది లేదు..
Ens Balu
4
Pamidi
2020-10-30 20:42:24
సచివాలయాలకు వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం పామిడి నగర పంచాయతీ పరిధిలోని గాయత్రి కాలనీ లో ఉన్న పామిడి -3 సచివాలయాన్ని, పామిడి మండలంలోని గజరాంపల్లి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు తగిన సమాచారాన్ని బాధ్యతగా అందించాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగులంతా ఎక్కడికి వెళ్ళినా విధిగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలన్నారు. సచివాలయాలపై నమ్మకం వచ్చే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా సచివాలయాలలో ఉద్యోగుల హాజరు పట్టికలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా సచివాలయాల్లో ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పామిడి మున్సిపల్ కమిషనర్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.