అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగుల ప్రతిజ్ఞ..
Ens Balu
3
Tirumala
2020-10-31 18:12:00
కేంద్ర విజిలెన్స్ కమిషన్(సివిసి) పిలుపు మేరకు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శనివారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో టిటిడి ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత కలిగి భక్తులకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా టిటిడి విజివో మనోహర్ మాట్లాడుతూ, అప్రమత్త భారత్, సంపన్న భారత్ అనే థీమ్‌తో ఈ ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, అధికార దుర్వినియోగం దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని, వీటిని అధిగమించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలని, తద్వారా కుటుంబానికి, సమాజానికి క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సంతృప్తికరంగా తిరుమల యాత్ర పూర్తి చేసుకుని వెళ్లేందుకు ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, ట్యాక్సీ డ్రైవర్లు, హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ వింగ్ విజివో ప్రభాకర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, అవకతవకలను గుర్తించినా టోల్‌ఫ్రీ నంబరకు తెలియజేయాలని, అక్కడి సిబ్బంది సంబంధిత విభాగాల అధికారులను అప్రమత్తం చేస్తారని చెప్పారు. ఈ మేరకు విజిలెన్స్ విభాగం ఫోన్ నంబర్లు, ఉన్నతాధికారుల ఈ-మెయిల్ వివరాలతో కూడిన ఫ్లెక్సీలను తిరుమల, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, రిసెప్షన్-1, రిసెప్షన్-2, కల్యాణకట్ట సిబ్బంది, భద్రతా సిబ్బంది,టిటిడి ఏఈవోలు సిఎ.రమాకాంత రావు, కృష్ణమూర్తి, రాజేంద్ర, ఎవిఎస్వోలు గంగరాజు, వీరబాబు, పవన్‌కుమార్, వెంకటరమణ, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.