కోవిడ్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించండి..
Ens Balu
3
Srikakulam
2020-10-31 19:37:26
కోవిడ్ పై విద్యార్ధులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురజాడ కళాశాలలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, నవంబరు మాసంలో పాఠశాలలు తెరుచుకునే సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసారు. విద్యార్ధులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై అవగాహన కలిగించాలని, ఇందు నిమిత్తం విద్యార్ధులకు వ్యాసరచన మరియు వ్యక్తృత్వపు పోటీలు నిర్వహించాలననారు. ఉపాధ్యాయులు ప్రతీ రోజు, విద్యార్ధుల ఆరోగ్యపరిస్థితిని తెలుకుకోవాలని, అనారోగ్య లక్షణాలున్న విద్యార్ధుల వివరాలను స్థానిక అధికారులకు మరియు పర్యవేక్షక అధికారులకు తక్షణమే తెలియచేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యం, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. విద్యార్ధుల సమాచారాన్ని నవంబరు 2వ తేదీ లోగా అప్ డేట్ చేయాలన్నారు. కోమార్బిడ్ విద్యార్ధులకు హాజరులో మినహాయింపు వుంటుందన్నారు. జగనన్న విద్యాకానుక కిట్స్ విద్యార్ధులందరికీ సి.ఆర్.పి.ల సహాయంతో పంపిణీ చేయాలని చెప్పారు. బయోమెట్రిక్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. విద్యాకానుక కిట్లు ప్రతీ ఒక్క విద్యార్ధికి తప్పని సరిగా అందించాలన్నారు. నాడు-నేడు పనులు పూర్తి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం పధకానికి సంబంధించి మానిటరింగ్ కొరకు IMMS APP కొత్తగా తయారు చేయడం జరిగిందని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు MDM APP మరియు IMMS APP రెండింటిలోను వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, ఉప విద్యాశాఖాధికారి పగడాలమ్మ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు హాజరైనారు.