నవంబరు 2 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు..
Ens Balu
3
Srikakulam
2020-10-31 19:45:53
శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 2వ తేదీ నుండి డా. వై.ఎస్.ఆర్.కంటి వెలుగు మూడవ విడత కార్యక్రమము పునఃప్రారంభిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా. జి.వి.రమణకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని అవ్వ తాతలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించి, కంటి అద్దాలు, మందులను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమము 2020 ఫిబ్రవరి 18 నుండి మార్చి 18 వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా ఇంతవరకు వాయిదా వేయడం జరిగిందని ఆయన వివరించారు. డా. వై.ఎస్.ఆర్.కంటి వెలుగు పథకంలో 60 సంవత్సరములు నిండిన 13,729 మంది అవ్వా తాతాలకు ఆప్తాల్మిక్ అధికారులు, ఏ.ఎన్.ఎంలు మరియు ఆశా వర్కర్ల సహాయంతో పరీక్షించామని చెప్పారు. ఇందులో 4,372 మందికి కంటి అద్దాలు రాయగా 1,324 మందిని రిఫర్ చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ మరియు స్వచ్చంద సంస్థల సహాయంతో ఇప్పటికి 420 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించి, కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని బెలగాం, పలాస నియోజకవర్గం లో-మందస, బుడంబో కోలని, టెక్కలి నియోజకవర్గంలో సంతబొమ్మాళి, నౌపాడ, శ్రీకాకుళం నియోజకవర్గంలో సింగుపురం, పాలకొండ నియోజకవర్గంలో దోనుబాయి, మర్రిపాడు, ఆమదలవలస నియోజకవర్గంలో తాడివలస, నరసన్నపేట నియోజకవర్గంలో పోలాకి, గుప్పెడు పేట, రాజాం నియోజకవర్గంలో బొద్దాం, పాతపట్నం నియోజకవర్గంలో బైదలాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గం లో పాతర్లపల్లి, రావాడ పి.హెచ్.సి లలో శిబిరాలు నిర్వహిస్తారు. 10 నియోజక వర్గాల పరిధిలో నిర్దేశించిన పి.హెచ్.సి లలో ప్రతీ రోజు కంటి పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో రోజుకు 20-25 మందిని మాత్రమే పరీక్ష చేయాలని నిర్ణయించామని చెప్పారు. కంటి వైద్య శిభిరంలో పి.హెచ్.సి వైద్యుడు పర్యవేక్షణలో ఆప్తాల్మిక్ ఆఫీసరు ,ఆయా పి.హెచ్.సి ల పరిధిలో ఓ ఉద్యోగి, ఆశ కార్యకర్త అందుబాటులో ఉంటారు. ఈ విధంగా 15 టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కంటి పరీక్షలపై విస్తృత ప్రచారం నిర్వహించి శిబిరాలకు పంపించాలని కోరారు. కార్యక్రము విజయవంతం అయ్యేందుకు స్వచ్చంద సంస్థలను భాగస్వామ్యం చేసామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వై.ఎస్.ఆర్ కంటి వెలుగు మూడవ దశలో అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేసేందుకు అంతా సిద్ధం చేసామని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితం గా పాటించేలా వైద్యులు,సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.