సకాలంలో రుణాలు అందిచాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-31 20:26:50

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డి.యల్.ఆర్.సి సమావేశం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జగనన్న తోడు, వై.యస్.ఆర్.బీమా, వై.యస్.ఆర్.చేయూత వంటి పలు అంశాలపై చర్చించారు. ముందుగా జగనన్న తోడు గురించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పథకాన్ని పక్కాగా అమలుచేస్తూ, శతశాతం పూర్తిచేసేలా బ్యాంకు అధికారులు కృషిచేయాలని చెప్పారు. ఇందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకోవాలని, లబ్ధిదారులకు సకాలంలో పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  వై.యస్.ఆర్.బీమా పథకం అమలులో జిల్లా ముందంజలో ఉండేవిధంగా బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖలు కృషిచేయాలని అన్నారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుదారుల ధృవీకరణ పత్రాలను సంబంధిత శాఖలు బ్యాంకులకు అందజేస్తాయని, వాటిపై బ్యాంకర్లు తక్షణమే స్పందించి బీమా డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. బీమా చెల్లింపుల్లో  పనిచేయని ఖాతాలు ఉంటే వాటిని వెంటనే సవరించి ఖాతాలు పునరుద్ధరణ అయ్యేటట్లు చూడాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ఎస్‌.ఎల్‌.బి.సి మార్గదర్శకాలకు అణుగుణంగా  వై.యస్.ఆర్ చేయుత కార్యక్రమం అమలవుతుందని కలెక్టర్ గుర్తుచేసారు. ఈ పథకం లక్ష్యాలను శతశాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వై.యస్.ఆర్.చేయూత రిటైల్ వాణిజ్య కార్యకలాపాలను స్థాపించేందుకు  స్వయం సహాయక సంఘాల మహిళలకు కోసం ఉద్దేశించబడిందని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఇప్పటికే వారి వ్యక్తిగత ఖాతాల్లో రూ.18750/ - జమ చేయడం జరిగిందని, మహిళలు మరింత ఆర్ధిక పురోగతిని సాధించేందుకు బ్యాంకులు కృషిచేయాలని సూచించారు. యస్.హెచ్.జిలు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని బ్యాంకులు సకాలంలో అందజేయాలని సూచించారు. రైతులకు, స్వయం సహాయక బృందాల మహిళలకు రుణాల చెల్లింపుల్లో జాప్యం చేయరాదని, బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూసుకోవాలని వివరించారు.           డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్  జి.వి.వి.డి.హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు మరియు వై.యస్.ఆర్.బీమా చెల్లింపులకు నవంబర్ 5 ఆఖరు తేదీగా ప్రకటించిందని, కావున బ్యాంకు అధికారులు సకాలంలో చెల్లింపులు చేసేలా సహకరించాలని కోరారు. అవసరమైతే బ్యాంకులకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను వాయిదా వేసుకొని సకాలంలో చెల్లింపులు చేయాలన్నారు. అలాగే ఖరీఫ్ రుణాలు మంజూరుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, దీనిలో భాగంగా పంట రుణాలు త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో కొత్త రుణాలతో పాటు పాత రుణాలు రెన్యూవల్ చేయవచ్చని స్పష్టం చేసారు. జిల్లాలో ఇప్పటివరకు 105 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు వాణిజ్య కార్యకలాపాల కోసం రుణాలు మంజూరుచేయడం జరిగిందన్నారు. మిగిలిన సంఘాలకు కూడా  రుణాలు మంజూరుచేయాల్సి ఉందని, వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ పి.కృష్ణయ్య, నాబార్డ్ డి.డి.ఎం మిళింద్ చౌషాల్కర్, డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు బి.నగేష్, మెప్మా పథక సంచాలకులు యం.కిరణ్ కుమార్, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.