గర్భిణిలకు పౌష్టికాహారం అందించాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-31 20:34:42
గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించి రక్తహీనత, అనారో గ్యాల నుంచి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్+ మరియు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం జిల్లా మరియూ ఐ టి డి ఎ స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ , వైద్య ఆరోగ్యం, పౌరసరఫరాలు, డైరీ డెవలప్మెంట్, జి సీ సీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నిర్దేశించిన కాలంలో నాణ్యమైన పాల సరఫరా చేయాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత మండలాల్లో మారు మూల ప్రాంతాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గుడ్లు పంపిణీలో భాగంగా చిన్న సైజ్ గుడ్లను పంపిణీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ విధంగా చేస్తున్న కాంట్రాక్టర్ల పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అదేవిధంగా న్యూట్రిషన్ కిట్స్ లో నాణ్యతలేని డ్రైఫ్రూట్స్, బెల్లం పంపిణీ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.అన్ని అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం సరఫరా పై ఆరా తీశారు. గర్భిణీలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను సరఫరా చేయాలన్నారు. బాలింత లు,చిన్నారుల రక్త హీనత రాకుండా వారికీ ఐరన్ టాబ్లెట్స్ సరఫరా చేయడం,ఎప్పటికప్పుడు చిన్నారుల బరువును చూడాలన్నారు. మాతాశిశు మరణాల శాతం తగ్గే విధంగా చూడాలన్నారు. తక్కువ బరువు గల అడాలసెంట్ పిల్లలను, గుర్తించి నివేదికను అందజేయాలన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ , మరియు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ , వార్డ్ సెక్రటేరియట్ లలో డిస్ప్లే చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి సీతా మహాలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్, పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్మలా బాయ్ , శివప్రసాద్, జి సి సీ, డైరీ డెవలప్మెంట్ శాఖల అధికారులు, సి డి పి వో లు తదితరులు హాజరయ్యారు.