సర్వాంద సుందరంగా సుబ్బలక్ష్మి కూడలి..
Ens Balu
5
Tirupati
2020-10-31 20:56:03
తిరుపతి నడిబొడ్డులో ఉన్న సుబ్బలక్మి కూడలిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలకసంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరపాలకసంస్థ అధికారులు, ఆయా ప్రోజెక్టుల ప్రతినిధులతో కలసి గరుడ వారధి, రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్, బాలాజీ కాలనిలో గల శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరుగుతున్న గరుడవారధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సుబ్బలక్ష్మి కూడలికి నాలుగు పక్కల నుండి వాహనాలు వస్తాయని, వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా ప్లాన్ ప్రకారం విశాలంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నాలుగు పక్కల పచ్చటి గడ్డితో లాన్ తీర్చిదిద్దాలని సూచించారు. బస్టాండ్ లోపలకు వెళ్లే డౌన్ ర్యాంపు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం రామాపురం వద్ద ఉన్న బయో మైనింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. నగరపాలక సంస్థ నగరంలో సేకరించిన చెత్త వేరు చెసే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. చెత్త వలన వచ్చే సేంద్రియ ఎరువును రైతులకు, ఉద్యాన వనాలకు ఇవ్వాలన్నారు. ఒక్కో రోజు ఎంత చెత్త వేరు చేస్తున్నారు, ఒక్కో వాహనంలో ఎంత చెత్త, ఎరువు తరలిస్తున్నారని, సి.సి. కెమెరా ల పనితీరు, లాగ్ బుక్ స్వయంగా పరిశీలించారు. రెండు వాహనాలకు చెత్త నింపి ఒక్కో వాహనాల్లో ఎంత చెత్త తరలిస్తున్నారని పరిశీలించారు. ప్లాంట్ లో ఎక్కువ సి.సి.కెమెరాలు ఏర్పాటు చెయాలని, చెత్త, ఎరువు తరలించే వాహనాల రాక పోకలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. వీలైనంత త్వరగా చెత్త నిర్వహణ పూర్తి చేయాలన్నారు. ప్లాంట్ చుట్టూ పచ్చని చెట్లు నాటాలన్నారు. అనంతరం బాలాజీ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం కాకుండా తక్కువ స్థలంలో కోర్ట్ ఏర్పాటు చేస్తుండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణం, ఉత్తరం వైపు కోర్ట్ వెడల్పు పెంచి విశాలంగా కోర్ట్ ఏర్పాటు చేయాలన్నారు. బేస్ బాల్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలు ఒకే కోర్టులో ఆడుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. కోర్టులో క్రీడాకారులు కింద పడ్డా గాయాలు కాకుండా సింథటిక్ ఫ్లోర్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ జి.ఎం (అడ్మిన్) చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానెర్ దేవికుమారి, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, దేవిక, కరుణాకర్, సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, ఏఈకామ్ రాజేందర్, అప్కాన్స్, జిగ్మా, సంస్థల ప్రతినిధులు ఉన్నారు.