ప్రజల ప్రాణాలు కాపాడటం పోలీసుల విధి..
Ens Balu
4
Tirupati
2020-11-01 14:06:47
నేషనల్ హైవే రోడ్ సేఫ్టీ దృష్ట్యా బైపాస్ మార్గాలలో ప్రయాణించే ద్విచక్ర వాహన దారులు తప్పని సరిగా ఇకపై హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా, పోలీస్ సిబ్బందికి అన్నమయ్య సర్కిల్ వద్ద హెల్మెట్లను ప్రదానం చేసారు. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల సరిహద్దులతో సంబందం లేకుండా ప్రమాదాలు, ఇతరాత్ర నేరాలు జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. హైవే రోడ్డులో ప్రమాదాలు జరుగు ప్రాంతాలను గుర్తించి అక్కడ డిజిటల్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణం విలువైనది, ప్రజలు యొక్క ప్రాణం కాపాడటం మన యొక్క విధిగా భావించి ప్రజలతో మనం, మనతో ప్రజలు అనే స్నేహభావం పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా పోలీస్ అధికారుల సమావేశంలో అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి తి సుప్రజ , డి.యస్.పి లు యస్.బి గంగయ్య, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, దిశా పి.యస్ రామరాజు, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.