పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్..
Ens Balu
6
Srikakulam
2020-11-01 16:20:17
ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన త్యాగధనుల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక బాపూజీ కళామందిర్ లో అవతరణ దినోత్సవ వేడుకలు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితాలను మనందరం అనుభవిస్తున్నామని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఫ్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసి అసువులు బాసారని, ఆ మహానీయుని త్యాగానికి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి త్యాగం అందరికీ ఆదర్శమని, ప్రతీ ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పాలన అందించాలని , ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ జనరంజక పాలనను అందిస్తున్న సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. వై.యస్.రాజశేఖర రెడ్డి నాడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వై.యస్.ఆర్. ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. వై.యస్.ఆర్ జలయజ్ఞం చేపట్టి వ్యవసాయ రంగానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మన ముఖ్యమంత్రి మంచి ఆశయం గల వ్యక్తి అని, అందులో భాగంగానే అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న పథకాలు ఇతరులను ఆలోచింపజేసే దిశగా పాలన అందిస్తున్నారని చెప్పారు. అందులో ఒకటైన దిశ చట్టం చారిత్రాత్మకమని ఉద్భోదించారు. స్థానికులకు పరిశ్రమలలో 75 శాతం రిజర్వేషన్లు, చట్టసభలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు, నవరత్నాలు వంటి అనేక వినూత్న పథకాలు ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలని ఉపముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం అని అన్నారు. ఆయన గొప్ప త్యాగ పురుషుడని, ఆ త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైందని, తద్వారా ప్రాంతీయ ఉద్యమాలు నెలకొన్నాయని స్పష్టం చేసారు. అందువలనే ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోవలసి వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశాఖపట్నం పాలనా రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతి, కర్నూలు న్యాయ రాజధానిగా కొనసాగడం తధ్యమని చెప్పారు. మరో ఉద్యమం రాకూడదనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు కోసం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సభాపతి వివరించారు. అభివృద్ధి మూల మూలలకు అందాలని, అందుకే వార్డు, గ్రామ సచివాలయాలు వెలిసాయని చెప్పారు. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. అందరికీ పాలన అందుబాటులో ఉండాలని, తద్వారా ప్రతి ఒక్కరిలో సంతృప్తి వస్తుందని పేర్కొన్నారు. పాలన అందుబాటులో ఉంటే వేర్పాటువాదన రాదని తేల్చిచెప్పారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం మంచి విషయం అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని ముఖ్యమంత్రి విశ్వసించి, మూడు రాజధానులు ఏర్పాటుకు ఆలోచించారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, అందులో భాగంగానే నాడు నేడు కార్యక్రమం క్రింద 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్యాలయాల్లో చికిత్సను ప్రజలు గొప్పగా భావిస్తున్నారని, అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూచిస్తున్నట్లు రాజ్యాంగ బద్ధ కమిటీ తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని కితాబు ఇచ్చారు.
తొలుత రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదని, త్వరలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. జిల్లాకు గొప్ప ఘన చరిత్ర ఉందని, దానిని ఇంకా అధ్యయనం చేసి గ్రంథ రూపంలో తీసుకు రావాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాతో మహాత్మా గాంధీ కి అత్యంత సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసారు.