పొట్టిశ్రీరాముల త్యాగఫలమే ఆంధ్రరాష్ట్రం..


Ens Balu
1
Anantapur
2020-11-01 19:48:23

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా విజయవాడ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి శంకర్ నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి మంత్రి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా వివిధ ప్రాంతాలలో నివాసం ఉండేవారని,  తెలుగు మాట్లాడేవారు ఒక రాష్ట్రంలో ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అవసరాన్ని గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. తెలుగు మాట్లాడే వారు ఒకటిగా ఉండాలని ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు.  నవంబర్ 1 వ తేదీ 1956 లో రాష్ట్రం అవతరించాక ఆంధ్ర రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రాష్ట్ర పురోభివృద్ధి జరగకపోయినా, కొంతమంది స్వార్థ ఆలోచనల వల్ల తెలుగు భాష మాట్లాడేవారు విడిపోవాల్సి వచ్చినా నవంబర్ 1 వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అమరజీవిని స్మరించుకోవడం కోసం, ఆయన స్ఫూర్తిని మననం చేసుకోవడం కోసం, ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవడం కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఒకటిన్నర సంవత్సర కాలంగా అపూర్వ ప్రజాదరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలిస్తున్నారన్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను చేసుకుంటూ రాష్ట్రంలో ఏ వర్గం కూడా బాధపడకుండా, కష్టపడకుండా వారి సంతోషం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని మనోధైర్యంతో తట్టుకుంటూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు నడుస్తోందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టి అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయరంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం, ఆకాంక్ష అన్నారు. ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష రెండో స్థానంలో ఉందన్నారు. దాదాపు పది కోట్ల మందికి పైగా రాష్ట్రం, దేశం, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను మాట్లాడే వారు ఉన్నారన్నారు. ఒక రాష్ట్రమంటూ లేని కాలంలో రాష్ట్రం కోసం పరితపించి ఖచ్చితంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆంధ్రులంతా ఉద్యమించడం జరిగిందని, ఆ ఉద్యమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణంతో పోరాటం జరిపి మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు. అటువంటి మహనీయులను ఈరోజు స్మరించుకుందామన్నారు. ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి గ్రామంలోనూ రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున క్లినిక్స్ ఏర్పాటు, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు రాష్ట్రప్రభుత్వం సుపరిపాలన తీసుకువస్తోందని, భవిష్యత్తులో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అన్ని రంగాలలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందు ఉండాలన్నారు. తెలుగు ప్రజలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని రెండూ సమ్మిళితం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, సభికులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ కమిటీ సిఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమ0) గంగాధర్ గౌడ్, డి ఆర్ ఓ గాయత్రి దేవి, సిపిఓ ప్రేమచంద్ర, డిఎస్ ఓ రఘురామిరెడ్డి, ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.