సీఎం వైఎస్ జగన్ తో నవశకానికి నాంది..
Ens Balu
2
Vizianagaram
2020-11-01 20:05:10
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి తన ప్రజారంజక పాలన ద్వారా రాష్ట్రంలో నవశకానికి నాంది పలికారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. తీవ్రమైన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో, కోవిడ్ఆ-19 నిబంధనలను పాటిస్తూ ఆదివారం ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలకు ఉపముఖ్యమంత్రి శ్రీవాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఉపముఖ్యమంత్రి తమ సందేశాన్ని వినిపించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, ఇతర నాయకులకు ముందుగా నివాళులర్పించారు. రాష్ట్రం రెండుగా విడిపోయి, హైదరాబాద్ లాంటి గొప్ప రాజధానిని కోల్పోయినప్పటికీ మనం నిలదొక్కుకున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోయామని విమర్శించారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి కారణంగా, సగర్వంగా మళ్లీ ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ, ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల పాలన ప్రజలకు మరింత చేరువ అయ్యిందని, ప్రభుత్వ సేవలన్నీ గ్రామస్థాయిలోనే అందుతున్నాయని చెప్పారు. ఎటువంటి సిఫార్సు లేకుండా, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతుండటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల దీనికి నిదర్శమన్నారు. నాడూ-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. రైతే దేశానికి వెన్నుముఖ అని భావించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఉద్యోగాల నియామకం నుంచి, నామినేటెడ్ పదవుల వరకూ అన్నిట్లోనూ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో, జిల్లాను అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీవాణి అన్నారు.
విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం వల్ల తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన రోజున, మళ్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి ఎక్కడా వెనుకాడకుండా, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని కొనియాడారు. జిల్లా అభివృద్దిలో తనవంతు పాత్రను పోషిస్తానని చెప్పారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతి, కళలు, విద్య, పరాక్రమం, శాస్త్రీయ దృక్ఫథంలో, ఇతరులకు తెలుగుజాతి ఒక దిక్సూచిలా నిలిచిందని కొనియాడారు. కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా అన్ని వర్గాలకూ మేలు కలిగేలా రాష్ట్రప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ నేతృత్వంలో, జిల్లా యంత్రాంగమంతా కలిసికట్టుగా కృషి, కోవిడ్ నియంత్రణలో ఆదర్శంగా నిలిచామని కిశోర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి పెనుమత్స సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, డిపిఎం బి.పద్మావతి, డిటిఓ ఎంఎల్ఎన్ లక్ష్మీనారాయణ, ఇంకా పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్‌వర్మ, డిఇఓ జి.నాగమణి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, బిసి కార్పొరేషన్ ఇడి నాగరాణి, డిపిఆర్ఓ డి.రమేష్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అనురాధా పరశురామ్, కోపరేటివ్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు, తాశీల్దార్ ప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ః
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతమూ ఆహుతులను అలరించాయి. ముందుగా మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే, నృత్య అధ్యాపకులురాలు హిమబిందు ఆధ్వర్యంలో గణేషుని స్థుతిస్తూ నృత్య గీత ప్రదర్శన జరిగింది. అనంతరం కళాశాల మృదంగ అధ్యాపకులు డాక్టర్ మండపాక నాగలక్ష్మి ఆధ్వర్యంలో మృదంగ తాళ వాయిద్య కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గేయాలాపన చేశారు. కళాశాల గాత్ర అధ్యాపకులు చాగంటి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో భక్తిగీతాలాపన జరిగింది. అవతరణ దినోత్సవ వేడుకలకు రామవరం జిల్లాపరిషత్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ః
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి రాజధానిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్‌కుమార్, ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్. మహేష్‌కుమార్, డిఆర్ఓ ఎం.గణపతిరావు పాల్గొన్నారు.