పొట్టిశ్రీరాముల వల్లే ఆంధ్రరాష్ట్ర సౌభాగ్యం..
Ens Balu
3
Parvathipuram
2020-11-01 20:27:35
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందని తమకి న్యాయం జరగాలి అంటూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి, ఆంధ్రరాష్ట్ర అవతరణకు కారణజన్ములు పొట్టి శ్రీరాములు అని పార్వతీపురం ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. నవంబర్ 01 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐ.టి.డి.ఎ గిరిమిత్ర సమావేశమందిరంలో ప్రాజెక్ట్ అధికారి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ఆంధ్రా ప్రాంతంలో అలజడి రేపింది. 1952 డిసెంబర్ 15న 58 రోజుల అకుంఠిత దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జులై 19న పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో 1956 నవంబర్ 1న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే, పాలకుల నిర్లక్ష్యంతో మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది. ఇది క్రమంగా ఉద్ధృతమై 1969 నాటికి తీవ్రరూపం దాల్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా, 2000 తర్వాత మాత్రం ప్రజల ఆకాంక్షలను ఎవరూ నిలువరించ లేకపోయారు. రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి,కార్మిక, కర్షక సంఘాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడంతో 2014లో ప్రత్యేక తెలంగాణ సాకారమైంది. దాదాపు 60 ఏళ్లపాటు కలిసున్న తెలుగువారు మరోసారి విడిపోయారు. కార్యక్రమంలో జగదీష్ మాస్టర్ దేశభక్తి గీతాలు ఆలపించారు. మన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కుల,మతం,రాజకీయాలకు అతీతంగా పలు అభివృధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు వాటి అమలులో పాల్పంచుకోడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ పి ఓ సురేష్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్, డిప్యూటీ డి.ఇ.ఓ మోహన రాయుడు, ఎ.ఎం.ఓ, పి. ఎం.ఆర్. సి ఎస్.వి. జి. కృష్ణా రావు, మేనేజర్ హేమలత, ఐ.టి.డి.ఎ ఆధికారులు సిబ్బంది పాల్గొన్నారు.