పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించాలి..
Ens Balu
2
Tirupati
2020-11-02 19:15:52
తిరుపతి నగరపాలకసంస్థ పాఠశాలల్లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కమిషనర్ గిరీషా ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలతో సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం బాలాజి కాలనీలోని మాలవ్యాజి స్కూల్ ను కమిషనర్ తనిఖీ చేశారు. స్కూలుకు హాజరైన విద్యార్థులతో ముచ్చటించారు. జగనన్న విద్యాకానుక అందరికి అందిందా అని అడిగారు. అందరూ యూనిఫామ్ వేసుకుని చక్కగా స్కూల్ కు రావాలన్నారు. స్టిచింగ్ చేయించుకుంటున్నామని, కొంత మందికి షూస్ అందలేదని చెప్పారు. షూస్ సైజ్ లు ఇస్తే అందరికి తెప్పిస్తామని ఇప్పటికే చెప్పానని, వెంటనే షూస్ సైజ్లు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడ్ని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ప్రతిరోజు థర్మల్ స్కానర్ తో పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యతతో అందించాలన్నారు. అలాగే నాడు-నేడు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గోడలకు బాగా రఫ్ చేసి, చక్కగా పెయింటింగ్స్ చేయించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, పరిసరాల్లో నిర్మాణాలు పరిశీలించి, నిర్మాణం పూర్తయిన వెంటనే శుభ్రం చేయించాలన్నారు. నాడు-నేడు పనులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ హరిత, ఉప విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు యుగంధర్, ఉపాధ్యాయులు ఉన్నారు.