మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర..
Ens Balu
3
Vizianagaram
2020-11-02 19:31:53
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీంతో పాటుగా వారి కష్టానికి తగిన ఫలితం దక్కేలా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాలో తొలిసారిగా భారీ సంఖ్యలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున పంటను సేకరించే ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది. రైతుకు ఏ రూపంలోనైనా కష్టం కలగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. స్వేదం చిందించి పండించిన పంట దళారుల పాలుకాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జిల్లాలో ఏకంగా 286 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 110 ప్రధాన కొనుగోలు కేంద్రాలు కాగా, మిగిలినవి అనుబంధ కేంద్రాలు. మొక్కజొన్న ఎక్కువగా పండించే 28 మండలాల్లో ప్రస్తుతం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఈ పంట కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 45,726 ఎకరాల్లో మొక్కజొన్నసాగైనట్లుగా ఈ-కర్షక్‌లో నమోదయ్యింది. సిఎం యాప్‌లో దాదాపు 15,276 ఎకరాలు నమోదు అయ్యింది. దీంతో సుమారుగా 36వేల మొట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పిఏసిఎస్, ఎఎంసి, గ్రామైక్య సంఘాల ద్వారా ప్రస్తుతం మొక్కజొన్న కొనుగోలు జరుగుతోంది.
ఇంతకుముందు కూడా అడపాదడపా మొక్కజొన్న కొనుగోలు జరిపినప్పటికీ, అరకొరగా నాలుగైదు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, పంట పండించిన రైతు, తన గ్రామంలోనే పంటను విక్రయించుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా, కేవలం పదిరోజుల్లోనే కొనుగోలును పూర్తి చేసేందుకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ చర్యలను చేపట్టారు. దీంతో మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్‌వి వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ, కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేస్తున్నారు. రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, అక్కడక్కడా పంట కొద్దిగా రంగు మారినప్పటికీ, రైతులు ఆందోళన చెందవద్దని, వాటిని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సేకరించిన మొక్కజొన్నకు వారం పదిరోజుల్లో, రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు చర్యలను తీసుకున్నారు. దీంతో రైతులు ధీమాగా తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.