అభివ్రుద్ధిలో అనంత ముందంజ..


Ens Balu
2
రెవిన్యూ భవన్
2020-11-02 20:04:31

అనంతపురం జిల్లా అభివృద్ధిలో  అన్ని రంగాలలో ముందువరసలో ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి పాలనలో ఉందని, రెగ్యులర్ సూపరింటెండెంట్ ను నియమించాలన్నారు. కరోనా వైరస్ మరోసారి వ్యాపించే అవకాశం ఉండడంతో, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. కోవిడ్ మరణాలు, పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచడం జరుగుతుందని తెలిపారు. హెల్త్ వర్కర్ల లాగా కోవిడ్ పై పోరాటంలో పాల్గొనే రెవెన్యూ మరియు ఇతర అధికారులకు బీమా సౌకర్యం అందిస్తే బాగుంటుందని విన్నవించారు. నాడు నేడు కింద ఒక పాఠశాలలో ఒక కేటగిరి గా పెట్టడం జరిగిందని,  జిల్లాలో 1280 పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఆయా పనులకు బడ్జెట్ మేరకు కేటాయించిన పనులు చేపట్టాలని, ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు పంపకుండా చూడాలని, ఎవరైనా కేటాయించిన బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులకు ప్రతిపాదనలు పంపించినట్లు పరిశీలనలో తేలితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉల్లికల్లు గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కిందకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలం లేక నిర్మాణాలు జరగని ఏవీ లేవని, అన్ని భవనాలకు స్థలం అందుబాటులో ఉందన్నారు. అంగన్వాడి భవనాలకు సంబంధించి సగానికిపైగా స్థల సేకరణ పూర్తయిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణం, అంగన్వాడీ భవనాలకు సంబంధించి గ్రౌండింగ్ విషయంలో రిపోర్టు సరిగా ఇవ్వకపోవడంతో, వాటికి సంబంధించిన రిపోర్టర్ వెంటనే తనకు అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద లేదా ప్రత్యేక కేటగిరీగా పరిగణించి దిగుబడిని కూడా బీమా కింద చేర్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద డబ్బులు వసూలు చేస్తే అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.    గడిచిన సంవత్సరకాలంలో మార్చి నుంచి ఇప్పటి వరకూ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించగా, కరోనా నేపథ్యంలో జిల్లాలో మౌలిక వసతులు తక్కువ ఉన్నా తక్కువ సమయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, కోవిడ్ ఆసుపత్రిలో సిబ్బంది నియామకం చేసుకోవడం నుంచి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య పెంచుకోవడం, ఆక్సిజన్ సరఫరా,  పరికరాలు సమకూర్చుకోవడం, పరీక్షల సామర్థ్యాన్ని 0 నుంచి 10 వేల వరకూ చేసేలా పెంచుకోవడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో జిల్లాలో కరోనాను సమర్ధవంతంగా కట్టడి చేశామన్నారు. పాజిటివ్ 2 శాతంకన్నా తక్కువకు వచ్చిందని,   కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, కరోనా కట్టడిలో మిగతా జిల్లాల కంటే మన జిల్లా మెరుగ్గా ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి 15 లక్షల సర్వీసులకు పరిష్కారం చూపించామన్నారు. 92 శాతం సర్వీసులకు నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో సచివాలయాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సమర్థవంతంగా సేవలను అందించామన్నారు. పెనుగొండలో మెడికల్ కళాశాలకు స్థలాన్ని సేకరించామన్నారు. ఐసిడిఎస్ పరిధిలోని పోషణ అభియాన్ లో అనంతపురం జిల్లా ముందువరుసలో ఉందని, గర్భిణీలకు అవసరమైన పోషకాహారాన్ని ఇస్తున్నామన్నారు. పెన్షన్ లను ఇంటి వద్దకు వెళ్లి ఇస్తున్నామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకానికి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని, ఉద్యోగుల నియామకానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఉద్యాన ఉత్పత్తులను దేశంలోనే రెండవ కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి ఢిల్లీ కి పంపించడం జరిగిందని, ఇందుకేజ్ ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం అందించారన్నారు.   అలాగే ఉపాధి హామీ పథకం కింద జూన్,  జూలై మాసంలో జిల్లాలో చాలా ఎక్కువగా ఉపాధి పనులు చేయించడం వల్ల ద్వారా రాష్ట్రంలోనే రెండవ అత్యధికంగా 500 కోట్లకు పైగా మెటీరియల్ కాంపౌండ్ జనరేట్ చేయడం జరిగిందని, దీని ద్వారా రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ, సచివాలయాల భవనాలు లాంటి ఎన్ని భవనాలైన కట్టుకోడానికి వెసులుబాటు ఉందన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద ఓకే రోజు 6 లక్షల 40 వేల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.