అన్నిప్రాంతాల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-02 20:17:37

నిరంతరం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఆలోచన అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం  అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటుచేసిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా  జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో కోవిడ్, ప్రైమరీ సెక్టార్, ఇరిగేషన్ యాక్టివిటీస్, రూరల్ వాటర్ సప్లై, ఉపాధి హామీ కన్వర్జెన్స్ పనులు, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు నేడు, సివిల్ సప్లైస్ కి సంబంధించి సమీక్ష నిర్వహించారు.   సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రివర్యులు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి సమావేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకు 9 అజెండా అంశాలపై విపులంగా చర్చించామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకమారు డి ఆర్ సి మీటింగ్ నిర్వహించాల్సి ఉందన్నారు. గత తొమ్మిది నెలల కాలంగా కరోనా మహమ్మారి ప్రబలి ఉన్న కారణంగా సమావేశం నిర్వహించడంలో ఆలస్యమైందన్నారు. జిల్లాలో సమర్థవంతంగా కోవిడ్ సమస్యను అధిగమించామని 46 లక్షల జనాభాకు ఆరు లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 590 మంది కోవిడ్ మరియు ఇతర అనారోగ్య సమస్యలతో మరణించారన్నారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలోని ఇతర ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. అయితే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను వ్యాధిగ్రస్తుల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారన్నారు. అలా డబ్బులు ఇవ్వని వారికి ఆరోగ్యశ్రీ లో చికిత్సలుచేయడం లేదని తెలిపారన్నారు. పది రోజుల్లో జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ వారితో  సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యం చేయాలని, అదనంగా డబ్బులు వసూలు చేస్తే వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ పరిధి నుండి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట ఆశించిన దిగుబడి రాలేదని, జిల్లాలో 4,74,000 ఎకరాల్లో వేరుశనగ, పత్తి, జొన్న పంట సాగు చేయగా, 80 శాతం వేరుశనగ సాగుచేశారన్నారు. దిగుబడి వచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసి ఆయా పంటలకు నష్టం జరిగిందన్నారు.  జిల్లాలో 80 శాతం వేరుశనగ పంట వేసినప్పటికీ చెట్టు పెరిగిందే కానీ కాయలు రాలేదని వచ్చిన పంట కూడా అధిక వర్షాల వల్ల దెబ్బతిందని ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వైయస్సార్ బీమా సౌకర్యం కింద బీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వం పథకం నుండి తప్పుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అయితే బీమా కింద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కారణంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించడం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్ని గుర్తించి ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు ఆదుకునేందుకు నష్టపరిహారంగా రైతులకు పరిహారం అందించాలని తీర్మానం చేశామన్నారు. ఇప్పటికే ఈ అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను జిల్లాకు పంపించి జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకుంటారన్నారు. జిల్లాలో వికలాంగుల కోసం సదరన్ సర్టిఫికెట్ల జారీ గత పది నెలలుగా చేపట్టలేదని, నవంబర్ 3 నుంచి 12 సెంటర్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారన్నారు. అంతేకాకుండా వికలాంగుల కోసం ప్రత్యేకంగా మొబైల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరారన్నారు. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నీటి పారుదల అంశంపై సమీక్షించాలని గత సంవత్సర కాలంగా నీరు వదులుతున్న కొన్ని చెరువులకు నీరు రాలేదని ప్రజా ప్రతినిధులు తెలిపారన్నారు. అధికారంతో, దౌర్జన్యంతో కొందరు నీటిని తీసుకుంటున్నారని తమ దృష్టికి రాగా, ఒక కార్యాచరణ ప్రకారం నీటి విడుదల జరగాలని సూచించామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులతో విజయవాడలో నీటిపారుదల శాఖ మాత్యులు అధికారుల సమక్షంలో ఏ ప్రాంతానికి ఎంత నీరు ఇవ్వాలో అన్ని చెరువులకు నీరు నింపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి మార్గాంతరణ లేకుండా జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపామన్నారు. కాలువలు బాగా చేయాలని, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం సకాలంలో నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రభుత్వ పథకాలకు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు సిసి రోడ్లు కాలువల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నెల రోజుల క్రితం బకాయిలు సంగతి చెప్పగా ప్రతి పైసా కూడా బకాయి లేకుండా ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే నాడు నేడు కింద కూడా బకాయిలను 100% చెల్లించామన్నారు. నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయల మేరకు పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఇందులో ఇదివరకే పది కోట్లు పనులకు ఆమోదం తెలిపామని, మిగిలిన ఐదు కోట్లకు ప్రతిపాదనలు పంపాలని, వీటిని మార్చిలోపు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. నాడు నేడు పనులు 85 శాతం పూర్తి కాగా, మిగిలిన 15 శాతం పనులు ఈ నెల 15లోపు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారని, అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమాచార లోపం ఉందని, ఈ సమావేశానికి హాజరయ్యే ముందు అన్ని అంశాలను సమీక్షించుకుని ఈ సమావేశానికి హాజరుకావాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇకపై ఇలాంటివి ఉపేక్షించబోమని హెచ్చరించారు. లేఅవుట్ డిక్లరేషన్ పై అలసత్వం ఉందని సమావేశంలో గ్రహించామని, ఇందుకోసం డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ తో మూడు రోజుల లోపు సమావేశం నిర్వహించాల్సి ఉందని డైరెక్టర్ను ఆదేశించామన్నారు. ఆ సమావేశంలో అధికారుల దృష్టి కి ప్రజాప్రతినిధులు సమస్యలను తీసుకురావాలని, విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకునేలా తాను డైరెక్టర్కు సూచించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభిమతానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలని, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. రెండు మూడు రోజుల్లో ఇసుకపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, ఆ మేరకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూస్తామన్నారు. కరోనా సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు ఉచిత బియ్యం, కందిపప్పు లను అందించామని మంత్రి తెలిపారు. ఇంటింటికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేయనున్నామన్నారు. మంచి వాతావరణం, సుహ్రద్భావంతో సమస్యలపై చర్చించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. కోవిడ్ నేపథ్యంలో పాత్రికేయుల సమావేశంలో కి అనుమతించలేదని, అన్యధా భావించ రాదని మంత్రి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన సబ్సిడీ, బీమా బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి తో రైతే రాజు అని భావించే ప్రభుత్వం తమదని, రాష్ట్ర స్థాయి కార్యదర్శి డైరెక్టర్లను జిల్లాకు పంపి పంట నష్టాలను అంచనా వేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. 2017 -18 సంవత్సరానికి సబ్సిడీ అందజేయడంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నవాటిని మాత్రం ఇవ్వడం లేదని, మిగిలినవి సక్రమంగా ఉంటే 100 శాతం చెల్లించడం జరుగుతుందన్నారు. ఎవరి పైనా దాడి జరిగితే సహించేది లేదని, ప్రత్యేకించి ఎస్సీల పై దాడి జరిగితే ఉపేక్షించేది లేదని తెలిపారు. సూక్ష్మసేద్యం, బిందు సేద్యం పై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎక్కువమందికి మేలు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మురుగునీరు శుద్ధి చేసే  కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, సంబంధిత ప్రాజెక్టు పై సాధ్యాసాధ్యాలపై మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, అనంతరం డీపీఆర్ ను కూడా సిద్ధం చేసి ఇవ్వాలని ఏజెన్సీని ఆదేశించామన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే హండ్రెడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ముడిపడి ఉందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్థికవనరులు ఎంత అవసరమో చూసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక జాతి ప్రయోజనాల దృష్ట్యా పోలవరం పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. పోలవరం పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అని, దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఆయన తనయుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పొలవరాన్ని పూర్తి చేస్తారని మంత్రి తెలిపారు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పి.ఎం.స్వా నిధి పథకం కింద 11,500 మంది వీధి విక్రయ దారులకు రూ.11.50 కోట్ల విలువైన మెగా చెక్ ను మంత్రి పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, శమంతకమణి, వెన్నెపూస గోపాల్ రెడ్డి,మహమ్మద్ ఇక్బాల్,ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి,తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి,ఉషాశ్రీ చరణ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్ రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్,సిరి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.