అంతర్జాతీయ ప్రమాణాలతో కోడిరామ్మూర్తి స్టేడియం..
Ens Balu
3
Srikakulam
2020-11-03 17:11:05
కోడి రామ్మూర్తి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిచేసి క్రీడాకారులకు అంకితం చేయడమే ఆయనకు అందించిన ఘన నివాళి అని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభిప్రాయపడ్డారు. కోడి రామ్మూర్తి జయంతి కార్యక్రమం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కోడి రామ్మూర్తి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోడి రామ్మూర్తి జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మారుమూల ప్రాంతంలో జన్మించిన కోడి రామ్మూర్తి మల్లయోధునిగా కీర్తిని ఆర్జించి జిల్లాకు మంచి పేరును తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మల్ల విద్యను ఒక ఆటలా కాకుండా సాధనతో ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహానుభావుడని అన్నారు. ఏదైతే ఆయన పేరుతో స్టేడియంను పునర్మిర్మాణం చేపడుతున్నామో దానిని సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావలసి ఉందని, దీనిపై ప్రభుత్వానికి, సాప్ మేనేజింగ్ డైరక్టర్ కు ప్రత్యేకంగా లేఖను రాయడం జరిగిందన్నారు. ఆ నిధులు విడుదలైతే త్వరితగతిన స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. కోడి రామ్మూర్తి జిల్లాకు అందించిన సేవలకు గుర్తుగా ఈ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు యం.వి.రమణ, సీనియర్ పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాల్, ఎ.యుగంధర్, యస్.జోగినాయుడు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.