3 అంబులెన్సులు ఇచ్చిన ఎంపీ కింజరాపు..
Ens Balu
2
Srikakulam
2020-11-03 19:56:25
శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త అంబులెన్సులు, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఒక బస్సును శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేసారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అంబులెన్సులను, బస్సును పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ జె నివాస్ కు అందజేసారు. మూడు అంబులెన్సులలో ఒక అంబులెన్సును ఐటిడిఏకు, ఒక అంబులెన్సును డి.ఎం.హెచ్.ఓ కార్యాలయానికి, మరో అంబులెన్సును శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు అందేజేయగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి బస్సును అందజేసారు. బస్సు విలువ రూ.26.74 లక్షలు కాగా, ఒక్కో అంబులెన్సు విలువ రూ.21.94 లక్షలు వెరశి రూ.92.56 లక్షలు వెచ్చించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్న తాను ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నానని చెప్పారు. దూర ప్రాంతాలకు చెందిన వారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు సకాలంలో వైద్యం పొందుటకు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతోందని చెప్పారు. వెంటనే వైద్య సదుపాయం కలుగుటకు అంబులెన్సు అవసరమని గుర్తించి అంబులెన్సులను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంబులెన్సులో వైద్యం త్వరిగతగతిన అందుతుందని చెప్పారు. గతంలో రెండు అంబులెన్సులు సరఫరా చేసామని చెప్పారు. విశ్వవిద్యాలయ విద్యార్ధులు క్షేత్ర స్ధాయి పర్యనటలకు వెళ్ళుటకు ఇబ్బందులకు గురి అవుతున్నారని దానిని అధిగమించుటకు బస్సును పంపిణీ చేసామని చెప్పారు. మౌళికసదుపాయాల ఇబ్బందులను తొలగించుటకు ఎంపిల్యాడ్ నిధులు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొంటూ ఆ నిధుల విడుదలను పునరుద్దరించాలని కోరారు. జిల్లా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఎం.పిల్యాడ్ నిధులను ఆరోగ్య అవసరాలకు ఉపయోగించడం ముదావహమన్నారు. సకాలంలో అవసరమైన చికిత్స పొందుటకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.కూన రాంజీ, రిజిస్ట్రార్ ప్రొ.కె.రఘుబాబు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, సర్వజన ఆసుపత్రి సూపరింటిండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్.ఎం.ఓ డా.ఆర్.అరవింద్, వైద్యులు డా.ప్రభాకర్, డి.ఎం.హెచ్.ఓ డా.కె.సి.నాయక్, ముఖ్య ప్రణాళికఅధికారి ఎం.మోహన రావు తదితరులు పాల్గొన్నారు.