ప్రభుత్వ భవనాల వివరాలు తెలియజేయండి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-03 20:02:08
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వ శాఖల భూములను, భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈప్రక్రియను 6వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన భూములు, ఆస్తులు, భవనాలు మొదలైన వాటి వివరాలను ప్రభుత్వ ప్రత్యేక పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో గల విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్ లకు సంబంధించిన వివరాలను ముఖ్యంగా ప్రధాన కేంద్రాలైన అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు లతోపాటు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అరుకులోయకు సంబంధించి ఈ వివరాలను పొందుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలం వివరాలు విస్తీర్ణం లతో సహా భవనాల వివరాలను తెలియజేయాలన్నారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు ఈ వివరాలను పంపించవలసి ఉంటుందన్నారు. రెవిన్యూ డివిజినల్ అధికార్లు వాటిని దృవీకరించాల్సి ఉంటుందన్నారు. ప్రతి అధికారి చిన్న సమస్యలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి వివరాలతో అప్లోడ్ చేయాలన్నారు. వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి వివరాలను కూడా క్షుణ్ణంగా తెలియజేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లు వారి పరిధిలో ఉన్న వివిధ శాఖల తాలూకు వివరాలను పర్యవేక్షించాలని చెప్పారు. కొత్త జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు అధికారి కార్యాలయం, జిల్లా న్యాయస్థానాలకు అవసరమైన భూములను గుర్తించాలన్నారు. విద్యాసంస్థలు వివిధ శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించి వాటి వివరాలను కూడా పొందుపరచాలని ఆదేశించారు. తదుపరి ప్రభుత్వ వెబ్ సైట్ నందు అప్లోడు చేయుటను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్లు ఎమ్. వేణుగోపాల్ రెడ్డి, పి అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు వి. విశ్వేశ్వరరావు, రాజారత్నం, రమణమూర్తి, నాగార్జునసాగర్, సూర్యనారాయణ, లీలావతి, లింగేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి, జయరామ ఆచారి తదితరులు పాల్గొన్నారు.