ప్రభుత్వ భవనాల సమాచారం అందించాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-11-03 20:44:49
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటుకోసం త్వరగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ దిశగా ఏర్పాట్లు ప్రారంభించింది. జిల్లాల పునర్విభజనకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర స్థాయి కమిటీలకు అందించడం, కొత్తగా ఏర్పడే జిల్లాలకు అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు సమకూర్చడం, కొత్త జిల్లాల సరిహద్దులు నిర్ణయం, వివిధ ప్రభుత్వ శాఖల ఆస్తుల మదింపు వంటి అంశాలపై జిల్లా స్థాయిలో నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి పునర్విభజన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్‌కుమార్, జె.వెంకటరావు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విధే ఖరే, జిల్లా రెవిన్యూ అధికారి గణపతిరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సబ్‌కమిటీల్లో పార్వతీపురం అధికారులను కూడా భాగస్వాములను చేస్తూ అక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతి సౌకర్యాలు చూసే బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. మూడు సబ్ కమిటీలకు జాయింట్ కలెక్టర్లను, ఒక సబ్ కమిటీకి జిల్లా రెవిన్యూ అధికారిని ఛైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయించారు. జిల్లా సరిహద్దుల నిర్ణయం, రెగ్యులేటరీ, న్యాయసంబంధ అంశాలు పర్యవేక్షించే కమిటీకి జాయింట్ కలెక్టర్(రెవిన్యూ, రైతుభరోసా) డా.జి.సి.కిషోర్ కుమార్, ప్రభుత్వ సిబ్బంది పునర్విభజన, స్ట్రక్చరల్ రీ ఆర్గనైజేషన్ కు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీకి జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆస్తుల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన కమిటీకి జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు నేతృత్వం వహిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్లు, తదితర టెక్నాలజీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కమిటీకి జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు నేతృత్వం వహించనున్నారు.
ఈ కమిటీల్లో పోలీసు శాఖ తరపున అదనపు ఎస్.పి.(పరిపాలన), జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ., రోడ్లు భవనాల శాఖ, జలవనరుల శాఖ ఎస్.ఇ.లు, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్.ఇ., జిల్లా విద్యాశాఖ అధికారులు, డి.ఆర్.డి.ఏ., డ్వామా తదితరల సంస్థల అధికారులను సభ్యులుగా నియమిస్తూ కలెక్టర్ నిర్ణయించారు. సబ్‌కమిటీల సమావేశాలు ఈనెల 5 నుండి 7వ తేదీ వరకు నిర్వహించి ఆయా కమిటీలకు అప్పగించిన పని తక్షణం ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు ఏర్పాటులో భాగంగా తాత్కాలిక వసతి(ట్రాన్సిట్) కోసం తగిన భవనాలు గుర్తించాలని ఐటిడిఏ పి.ఓ., సబ్ కలెక్టర్‌లకు సూచించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం పార్వతీపురంలో ఖాళీగా వున్న ప్రభుత్వ భవనాలు గుర్తించే పని చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రైవేటు వసతి కూడా ఏర్పాటు చేయాల్సి వుంటుందని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణకుమారి, జిల్లా అదనపు ఎస్.పి. సత్యనారాయణ రావు, జిల్లావిద్యాశాఖ అధికారి నాగమణి, జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి విజయలక్ష్మీ, ఖజనా శాఖ ఉపసంచాలకులు, జిల్లా సామాజిక అటవీ అధికారి జానకిరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.