ప్రభుత్వ నియమావళిలో రాజీపడొద్దు..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-03 20:45:51
పరిశ్రమల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నియమావళిని అమలుపరచడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని జేసీ జె.వెంకటరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన డీఐపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నిర్వహణలో పాటిస్తున్న నియమావళి, నిబంధనలు భద్రతా పరమైన తదితర అంశాలపై సమీక్షించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల, అగ్నిమాపక, బాయిలర్స్, విద్యుత్తు శాఖల అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. జిల్లాలో ఉన్న 65 ప్రమాదకర పరిశ్రమలకు గాను 44 పరిశ్రమలను తనిఖీ చేశామని, వాటిలో కొన్నింటికి నోటీసులు జారీ చేశామని డీఐసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్) జెనరల్ మేనేజేర్ కె.ప్రసాదరావు వివరాలు వెల్లడించగా జేసీ పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. శాఖల వారీగా అధికారులతో మాట్లాడి సలహాలు, సూచనలు అందజేశారు. ప్రభుత్వం జీవో నెం.156లో పేర్కొన్న ప్రతి అంశాన్నీ ఇటు అధికారులు, అటు పరిశ్రమల నిర్వహకులు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు తరచూ కంపెనీలను తనిఖీ చేయాలని, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. భద్రతాపరమైన చర్యలు చేపట్టని వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేసి పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీ చేస్తూ సంబంధిత నివేదికలను ఆయా విభాగాధిపతులకు సమర్పించాలని సూచించారు. ఇప్పటివరకు పలు శాఖల జారీ చేసిన నోటీసులకు సంబంధించి పురోగతి ఎలా ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ నుంచి అధిక సంఖ్యలో 33, కాలుష్య నియంత్రణ మండలి నుంచి 16, పరిశ్రమల శాఖ 26, బాయిలర్స్ విభాగం రెండు నోటీసులు జారీ చేసినట్లు ఆయా విభాగాల అధికారులు వెల్లడించారు. కంపెనీలు అందజేసిన నివేదికలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జేసీ సూచన చేశారు. పరిశ్రమల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక, పరిశ్రమల, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.