ముగ్గురు అధికారులకి కలెక్టర్ షోకాజ్ నోటీసులు..
Ens Balu
2
అనంతపురం
2020-11-03 21:07:18
అనంతపురం జిల్లాలో మూడు శాఖలకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతు భరోసా కేంద్రాలు, పేదలందరికీ ఇళ్ళు పథకాలకు సంబంధించి వాస్తవ నివేదికలు ఇవ్వడంలో విఫలమయ్యారని పంచాయతీ రాజ్ ,వ్యవసాయ, హౌసింగ్ శాఖల జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టర్ సోమవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, నవంబర్ 2 వ తేదీన నిర్వహించిన వ్యవసాయం , రైతు భరోసా కేంద్రాల నిర్మాణంపై సమీక్షలో భాగంగా కొంతమంది ప్రజా ప్రతినిధులు చాలా చోట్ల పనులు ప్రారంభించలేదని తెలిపారు. అయితే పంచాయతీ రాజ్ శాఖ అధికారులు 800 ఆర్బికెలు పురోగతిలో ఉన్నాయని , అన్ని ప్రదేశాలలో పనులు ప్రారంభమయ్యాయని ఆన్లైన్ లో అప్‌లోడ్ చేసి , ఆ నివేదికలను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. భౌతిక పురోగతికి, ఆన్‌లైన్‌లో చూపిన పురోగతికి పొంతన లేకుండా ఉండడంతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం , అందునా ముఖ్యమంత్రి స్వయంగా స్పందన వీడియో సమావేశాలలో సమీక్షిస్తున్న అంశం అయినప్పటికీ , ఆ సమావేశాలకు కూడా వాస్తవ నివేదికలను ఇవ్వలేదని, క్షేత్ర స్థాయి అధికారులతో సరైన విధంగా సమీక్షించకుండా ఆర్బికెల కోసం సైట్ లభ్యత, ఆర్బికెల నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి వాస్తవ సమాచారాన్ని సేకరించడంలో విఫలమయ్యారని, అటు ముఖ్యమంత్రి తో పాటు కలెక్టర్ ను తప్పు దారి పట్టించే విధంగా నివేదికలు ఇచ్చి స్థూల ఉల్లంఘనకు పాల్పడ్డారని కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ మహేశ్వరయ్యకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా 800 రైతు భరోసా కేంద్రాలకు సైట్లు అప్పగించారని నివేదికలిచ్చి, డిఆర్ సీ సమావేశంలో మాత్రం సైట్లు అప్పగించలేదని తెల్పడంపై వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణయ్యకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ విషయాలు తెలుసుకోవడం లో విఫలం కావడంతో పాటు ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించలేదని నోటీసులో వివరణ కోరారు. అలాగే నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం కింద మునిసిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని పేదలకు అందించాల్సిన ఇళ్ల స్థలాల లెవెలింగ్ బిల్లుల సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించినప్పటికీ, సమాచారాన్ని తెప్పించుకోలేదని హౌసింగ్ పీడీ కె.బాల వెంకటేశ్వర రెడ్డి లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ ముగ్గురు అధికారులు మూడు రోజుల్లోపు తమ వివరణను సమర్పించాల్సిందిగా కలెక్టర్ షోకాజ్ నోటీసుల్లో ఆదేశించారు.