సచివాలయాల్లో నిర్ణీత సమయంలో సేవలందాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-03 21:11:32

గ్రామ, వార్డు సచివాలయాల్లో  ప్రజలకు అందించే సేవలను  నిర్దేశించిన గడువు లోపే పరిష్కరించాలని, గడువు ముగిసిన తర్వాత , ఏ ఒక్క సర్వీసు పెండింగ్ ఉండడానికి వీలులేదని, ఎప్పటికప్పుడు సర్వీసులకు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పెండింగ్ లో ఉన్న సర్వీసులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, జిల్లా పరిషత్ సీఈఓ, డిపివో, ఆర్డీఓ లు, తహశీల్దార్ లు, ఎంపీడీవోలు, సచివాలయ ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వీసులను పరిష్కరించడంలో ఇప్పటివరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ ఉద్యోగులు బాగా పని చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సచివాలయాలకు వచ్చిన 15 లక్షలకు పైగా సర్వీసులలో 95 శాతంపైగా సర్వీసులో రెవెన్యూ శాఖ నుండి వచ్చాయని, వాటిని పరిష్కరించడంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓలు, తహశీల్దార్ లు, ఇతర అధికారులు మంచిగా పని చేశారన్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలకు రెవెన్యూ శాఖకు సంబంధించిన సర్వీస్ రిక్వెస్ట్ లు మాత్రమే వస్తున్నాయని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారన్నారు. అయితే ఆయా సర్వీసులను పరిష్కరించే క్రమంలో నిర్దేశించిన సమయం లోపు వాటిని పరిష్కరించడం లేదని, ఎస్ ఎల్ ఏ ( సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్) లోపు ఆయా సర్వీసులను పరిష్కరించడం చాలా ముఖ్యమన్నారు. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత ఆయా సర్వీసులను పరిష్కరిస్తున్నారని, వచ్చిన మొత్తం సర్వీసులలో 14 - 15 శాతం సర్వీసులను వాటికి ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత పరిష్కారం చేస్తున్నారని, అలా జరగడానికి వీలు లేదన్నారు.  జిల్లాలోని ఒక్కో సచివాలయానికి ఒక రోజులో 4-5 సర్వీసులు వస్తున్నాయని, ఆయా సర్వీసులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించకుండా పెండింగ్ పెడుతున్నారని, జిల్లాలో ఇప్పటివరకు 1000 వరకూ సర్వీసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అయితే సమయం పూర్తయిన తర్వాత ఒక సర్వీసు కూడా పెండింగులో ఉండడానికి వీలు లేదని, ఇందుకు సంబంధించి సచివాలయాలలోని సర్వీసులకు పరిష్కారం చూపించాలని ఆదేశించినా పూర్తిగా సర్వీసులకు పరిష్కారం చూపించలేని జిల్లాలోని 10 సచివాలయాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.  ప్రస్తుతం అనంతపురం రూరల్ మండలంలో 43 సర్వీసులు పెండింగులో ఉన్నాయని, ముదిగుబ్బ మండలం లో 45, ఎన్ పి కుంట మండలం లో 40, కళ్యాణదుర్గం మండలం లో 40, ఇంకా అమరాపురం తదితర  మండలాల్లో ఇలాగే  గడువు దాటిన సర్వీస్లు పెండింగ్ లో ఉన్నాయని, మంగళవారం అర్ధరాత్రి లోపు జిల్లాలోని ఏ మండలంలో కూడా గడువు ముగిసిన   ఒక్క సర్వీస్ కూడా పెండింగ్లో ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గడువు ముగిసిన సర్వీసులకు 100 శాతం పూర్తిగా పరిష్కారం చూపించాలన్నారు. బుధవారం నుంచి గడువు ముగిసిన ఒక సర్వీసు కూడా పెండింగ్లో ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రెటరీల పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి మునిసిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్,  ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పెండింగ్లో ఉన్న గడువు ముగిసిన సర్వీసులకు పరిష్కారం చూపించాలన్నారు. బుధవారం నుంచి ఏ సమయంలో ఆన్లైన్లో చెక్ చేసుకున్నా గడువు ముగిసిన సర్వీసులు పెండింగ్లో ఉండకూడదన్నారు. ఇది జీరో ఉండాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న గడువు ముగిసిన సర్వీసులను తక్షణం పరిష్కరించడం పై  పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ని కలెక్టర్ ఆదేశించారు.