అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు..
Ens Balu
2
కొండగుంపాం
2020-11-04 19:30:57
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించి, వారికి లబ్ది చేకూర్చాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, అవి వారికి చేరేందుకు కృషి చేయాల్సిన బాధ్యతకూడా సిబ్బందిపైనే ఉందని స్పష్టం చేశారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామంలోని సచివాలయాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను, హాజరు పట్టీని, ఇ-రిక్వెస్టులను, ప్రజలకు అందించిన పథకాల వివరాలను, పెండింగ్ జాబితాలను పరిశీలించారు. అమ్మ ఒడి, జగన్నన్న చేయూత, జగనన్న తోడు, రైతు భరోసా, జలకళ తదితర పథకాలపై ఆరా తీశారు. పెండింగ్‌కు ఉన్నకారణాలపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంపై వాకబు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పేదవాడికీ లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానిని సాధించే బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పంచి, ఆయా పథకాలు అందేలా సహకరించాలని సూచించారు. రైతు భరోసా రాకపోవడానికి కారణాలను తెలుసుకొని, రెవెన్యూ పరమైన సమస్యలేమైనా ఉంటే, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే సిమ్మెంటును స్థానికంగానే కొనుగోలు చేసుకోవాలన్నారు. ఇ-రిక్వెస్టులు నిర్ణీత కాలవ్యవధిలోగానే పరిష్కరించాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జలకళ పథకం రైతుల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని కలెక్టర్ అన్నారు. రైతుకు నీటివసతిని కల్గిస్తే, ఏడాదికి మూడు పంటలు పండి, ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని, అందువల్ల వీలైనంత ఎక్కువమందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని కోరారు. ఒక్కో సచివాలయం పరిధిలో వంద బోర్లు తవ్వించేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక పద్దతులు అందుబాటులో ఉన్నాయని, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది సైతం సచివాలయాల్లో సిద్దంగా ఉన్నారని చెప్పారు. వీరందరి లక్ష్యం ప్రజలకు మేలు చేయడం, సకాలంలో సేవలను అందించడమేనని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. ఈ పర్యటనలో ఎంపిడిఓ రాజ్‌కుమార్, స్థానిక నాయకుడు సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.