ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్..
Ens Balu
6
Nellimarla
2020-11-04 20:00:16
మనం తరచూ చేతులను ఎందుకు శుభ్రం చేసుకోవాలి ? దానివల్ల కలిగే ప్రయోజనం ఎమిటి ? శ్వాసనాళ వ్యవస్థకు వచ్చే వ్యాధులు ఏంటి ? ఇ-కోలి బ్యాక్టీరియా కలిగించే నష్టం ఏమిటి ? ఇలా వరుసగా ప్రశ్నలు అడిగి, విద్యార్థులకు ఆయా విషయాలపట్ల ఉన్న అవగాహనను తెలుసుకొనే ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్. తన అత్యున్నత హోదాను ప్రక్కనపెట్టి, ఒక్కసారిగా ఉపాధ్యాయుడిగా అవతారమెత్తారు. ఈ అరుదైన సంఘటన నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారికి కోవిడ్ నిబంధనావళిని వివరించారు. కరోనా వ్యాధిపట్ల, అది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా, వివిధ రకాల ప్రశ్నలద్వారా విద్యార్థుల అవగాహనా స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేశారు కలెక్టర్. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండాలంటే కేవలం మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతోపాటుగా, మరికొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 15 రకాల కోవిడ్ నిబంధనలను ఆయన విద్యార్థులకు వివరించారు. పలకరించుకొనేటప్పుడు ఒకరినొకరు తాకకుండా నమస్కారం చేయాలని, వ్యక్తులమధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, కళ్లు, నోరు, ముక్కును తాకకూడదని, శ్వాసవ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరచూ సబ్బుతోగానీ, శానిటైజర్‌తో గానీ చేతులను శుభ్రపరుచుకోవాలని, గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తులను వాడరాదని, మనం తాకే వస్తువులను, సంచరించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తప్పనిసరి అయితే తప్ప ప్రయాణాలను చేయకూడదని, వ్యాధి సోకినవారిపట్ల వివక్షత విడనాడాలని, వారు కోలుకొనేందుకు అవసరమైన మనోధైర్యాన్ని ఇవ్వాలని, గుంపు ప్రాంతాలకు వెళ్లరాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, పోస్టింగ్‌లు చేయకూడదని, నమ్మకమైన వైద్యులు, నిపుణుల వద్దనుంచే అవసరమైన సమాచారాన్ని పొందాలని తదితర కోవిడ్ నిబంధనలను వివరించారు. అవసరమైన సమాచారం కోసం జాతీయ టోల్‌ఫ్రీ నెంబరు 1075, రాష్ట్ర హెల్ప్‌లైన్ నెంబరు 1902ను సంప్రదించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కలెక్టర్‌తోపాటుగా ఎంపిడిఓ రాజ్‌కుమార్, పాఠశాల హెడ్‌మాష్టర్ వై.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.