తిరుమలలో ఈవో విస్తృత పర్యటన..
Ens Balu
2
Tirumala
2020-11-04 20:03:05
టిటిడి ఈవో డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి బుధవారం తిరుమలలో విస్తృతంగా పర్యటించారు. శ్రీవారి ఆలయంలోని అన్న ప్రసాదాల పోటు, లడ్డూ ప్రసాదాల పోటు, ఆలయం వెలుపల ఉన్న బూంది పోటు, సన్నిధానం అతిథి గృహం, అశ్విని ఆసుపత్రి, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలను అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఆలయం పోటులో భద్రత పరంగా తీసుకుంటున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. బూంది పోటులో జరుగుతున్న పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సన్నిధానం అతిథి గృహంలో గదులను పరిశీలించారు. గదుల శానిటైజేషన్, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని గార్డెన్ నిర్వహణపై ప్రత్యేక దృష్ఠి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అశ్విని ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాలు, రోజు వారి ఒపిలు, అత్యవసర కేసుల వివరాలను తెలుసుకున్నారు. అపోలో ఆసుపత్రి నిర్వహిస్తున్న కార్డియాలజి చికిత్స కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులు, రోగులకు అత్యవసర పరిస్థితులలో అందించే వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను గురించి తెలుసుకున్నారు. అనంతరం కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌ను పరిశీలించి చెత్త నుండి ఎరువు తయారుచేసే విధానం, ఇందుకు గాను తీసుకుంటున్న జాగ్రత్తలనుఅధికారుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత కల్యాణ వేదిక సమీపంలోని ద్రవ వ్యర్థాల నిర్వహణ ( లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ రమేష్‌రెడ్డి, ఎస్ ఇ -2 నాగేశ్వరరావు, ఆరోగ్య అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విజివో మనోహర్, సిఎంవో డా.నర్మద ఈ పర్యటనలో పాల్గొన్నారు.