ప్రభుత్వ కార్యాలయాల సమాచారం ఇవ్వండి..
Ens Balu
2
Vijayawada
2020-11-04 20:07:10
జిల్లాల పునర్విభజన చర్యల్లో భాగంగా క్రిష్ణా జిల్లా, డివిజినల్ కార్యాలయాల పరిధిలో ఉన్న భవనాలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఖాళీ స్ధలాలు, తదితర భూముల వివరాలను వెంటనే ప్రభుత్వ అధికారిక యుఆర్‌యల్ లింక్ ద్వారా అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం జిల్లాల పునర్విభజన చర్యల్లో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన డివిజినల్ స్ధాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న స్ధలాల వివరాలను జిల్లాల పునర్విభజన చర్యల్లో భాగంగా సేకరించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగానే వివిధ శాఖల పరిధిలో పనిచేసే డివిజినల్ స్ధాయి అధికారులు క్షేత్రస్ధాయి పరిశీలన చేసి వాటి వివరాలను అధికారికంగా రూపొందించిన యుఆర్‌యల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవలసిందిగా ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. సులభతర విధానంలో రూపొందించిన వెబ్‌సైట్‌లో వెంటనే ఆయా డివిజన్ స్ధాయి అధికారులు వారికి అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకుని ఖాళీస్ధలాల వివరాలు, భూముల వివరాలు, భవనాల వివరాల నివేదికలను రూపొందించాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్ధలాల వివరాలను సేకరించి వాటిని సంబంధిత డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్లు, ఆర్ డివోలతో ధృవీకరించుకుని అప్‌లోడ్ చేయాలని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. ఖాళీ స్ధలాలను ధృవీకరించాల్సిన బాధ్యత ఆయా సబ్ కలెక్టర్లు, ఆర్‌డివోలు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉన్న ఖాళీస్ధలాల వివరాల డేటా రూపొందించడంలో కేవలం గుడివాడ డివిజన్ పరిధిలోనే కొంతమేర పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత మాట్లాడుతూ ప్రభుత్వం ఎ ంతో సులభతరంగా రూపొందించిన యుఆర్‌యల్ లింక్‌లో డేటా వివరాలను నమోదు చేయడం సాధ్యం అవుతున్నదని ఆమె తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆయా శాఖల నుండి వివరాలు సేకరించేందుకు కలెక్టరేట్ పరిధిలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసి డేటా సేకరణకు కలెక్టరు ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. ఈసమావేశంలో డిఆర్ఓ యం. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల డివిజన్ స్ధాయి అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.