PMAGY పనులు సత్వరం పూర్తిచేయండి..
Ens Balu
3
Tirupati
2020-11-04 20:21:41
ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం (PMAGY) ద్వారా గ్రామ అభివృద్ధి కమిటీలో గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ (MSJE) జాయింట్ సెక్రెటరీ కళ్యాణి చదా (KALAYANI CHADHA)సూచించారు. బుధవారం సాయంత్రం న్యూ డిల్లీ నుండి ఎం. ఎస్. జె. ఈ. జాయింట్ సెక్రెటరీ దేశంలోని అన్ని రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించగా తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త పాల్గొన్నారు. జాయింట్ సెక్రెటరీ వివరిస్తూ ఎం. ఎస్. జె. ఈ. గ్రాంట్స్ ను త్వరగా ఖర్చు చేసి వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి కమిటీ గుర్తించిన గ్రామాల అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నదని వాటికి మొదటి, రెండు దశల్లో గుర్తించిన పనులు పూర్తి చేయాలని సూచించారు.షెడ్యూల్ కులాలు 50 శాతం కన్నా ఎక్కువ జనాభా వున్న గ్రామాల్లో రోడ్లు, విద్యుత్,పరిశుభ్రత, ఆరోగ్య , సామాజిక భద్రత, విద్య, య్వతకు స్కిల్ డెవెలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టవచ్చని వివరించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ చిత్తూరు జిల్లాకి మొదటి దశలో 37, రెండవ దశలో 39 గ్రామాలను మంజూరు కాగా వాటిలో 50 శాతం కన్నా ఎస్.సి. జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను గుర్తించామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కమిటీలో 37 గ్రామాలలో 328 పనులు గుర్తించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, రెండవ దశకు సంబంధించి గ్రామాల జాబితా జిల్లా అభివృద్ధి కమిటీలో ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో డి. డి. సోషల్ వెల్ఫర్ ప్రసాద్ రావు, ఎ.ఎస్.ఓ చిరంజీవులునాయిడు, అధికారులు పాల్గొన్నారు.