పచ్చదనాన్ని పెంపొందించాలి..
Ens Balu
3
Vizianagaram
2020-11-05 13:50:12
విజయనగరం జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కోరారు. విజయనగరం పూల్‌బాగ్ కాలనీ బిట్-1లోని వాడవీధి మున్సిపల్ పార్కులో మొక్కలను నాటే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. పార్కులో ముందుగానే చెత్తాచెదారాలను తొలగించడంతో, సుమారు 150 మొక్కలను నాటి, అహ్లాదంగా తీర్చిదిద్దే పనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడం ద్వారా అందరమైన పరిశరాలతోపాటుగా, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. పట్టణంలోని పార్కులను అందంగా, అహ్లాదకరంగా తీర్చిదిద్దడంతోపాటు, ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా అక్కడి పార్కులో షటిల్ కోర్టును, వాలీబాల్ కోర్టును, వాకింగ్ ట్రాక్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్కుచుట్టూ ప్రహరీగోడ నిర్మాణం దాదాపు పూర్తి అయ్యిందని, వెంటనే సున్నం వేసి, ఈ నెల 25లోపల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, డిఎఫ్ఓ ఎస్.జానకిరామ్, హరిత విజయనగరం కో-ఆర్డినేటర్ ఎం.రామ్మోహన్, డాక్టర్ వెంకటేశ్వర్రావు తదితర ప్రముఖులు, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.