ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..
Ens Balu
3
Machilipatnam
2020-11-05 14:03:57
రాష్ట్రంలో రైతులు విక్రయించే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇది నూటికి నూరు శాతం రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. గురువారం ఉదయం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ , రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నేరుగా ఆయన వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణాజిల్లాలో 801 రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. కంప్యూటర్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, స్కానర్లు, నాణ్యత కిట్లు, పొట్టు తీసే పరికరాలు కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని తెలిపారు. రైతుల కళ్లాల వద్దకు టెక్నికల్ సిబ్బంది వెళ్లాలని సూచించారు. నాణ్యత పరీక్షలు టెక్నికల్ అసిస్టెంట్లు ట్యాబ్‌ల ద్వారా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైల సహకారంతో కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణ, బందరు ఆర్డివో ఎన్.ఎస్.కె. ఖాజావలి, తాసిల్దార్ సునీల్ బాబు , వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మోహనరావు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.