జిల్లాల పునర్విభజనకు సబ్ కమిటీలు..
Ens Balu
3
Vizianagaram
2020-11-05 17:55:26
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జోరందుకుంది. జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అధ్యక్షతన మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో సంయుక్త కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులను చైర్మన్లు గా నియమిస్తూ నాలుగు సబ్ కమిటీలను ప్రకటించిన సంగతి విధితమే. ఈ మేరకు ఆయా కమిటీల సభ్యులతో చైర్మన్లు గురువారం మొదటి విడత సమావేశాలు నిర్వహించారు. జనాభా, సరిహద్దులు, భూ సంబంధిత, న్యాయపరమైన అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. వివరాల సేకరణలో అవలంభించాల్సిన విధానాలపై పలు మార్గ నిర్దేశకాలు చేశారు. వివరాల సేకరణలో, పొందుపరచటం లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. జేసీ కిషోర్ కుమార్, జేసీ మహేష్ కుమార్, జేసీ వెంకటరావుల అధ్యక్షతన గురువారం వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో చర్చించారు. పార్లమెంట్ స్థానాల వారీగా జనాభా వివరాలు పక్కాగా సేకరించాలని సబ్ కమిటీ -1 చైర్మన్, జేసీ కిషోర్ కుమార్ సూచించారు. ప్రాంతాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాల వారీగా సేకరణ ఉండాలని చెప్పారు. పురుషులు, మహిళలు, పిల్లలు, వయోవృద్ధులు వివరాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వారీగా వివరాలు సేకరించి సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. కులాల వారీగా వర్గీకరణ చేసుకొని ప్రక్రియను సులభతరంగా నిర్వహించాలని హితవు పలికారు. జామి మండలంలో కొంత భాగం కొత్తవలస నియోజకవర్గ పరిధిలోకి, మరికొంత భాగం గజపతి నగరం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వివరాలు సేకరించాలని సూచించారు. ఇలాంటి ప్రాంతాలు ఉన్న చోట మిగతా శాఖల అధికారులతో సమన్వయంగా వ్యవరించి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి చెప్పారు. అంతేకాకుండా జిల్లాలోని ఉన్న వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల వివరాలను సహేతుకంగా పొందుపరచాలని సబ్ కమిటీ -2 చైర్మన్, జేసీ మహేష్ కుమార్ ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సాధ్యమైనంత మేరకు సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ భూముల వివరాలను త్వరితగతిన సేకరించి పొందు పరచాలని సబ్ కమిటీ -3 చైర్మన్, జేసీ వెంకటరావు సూచించారు. కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అరుకు, పార్వతీపురం, విజయనగరం పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని సూచించారు. సేకరించిన వివరాలను సాంకేతికత సాయంతో సరిగ్గా అప్లోడ్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న కార్యాలయాల్లో ఎన్ని ప్రభుత్వానికి చెందినవి, ఎన్ని ప్రైవేట్ యాజమాన్యాలకు చెందినవి స్పష్టంగా పేర్కొంటూ వివరాలు పొందుపరచాలన్నారు. ఆయా సమావేశాల్లో సబ్ కమిటీల సభ్యులైన డీఆర్వో ఎం.గణపతి రావు, జిల్లాపరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, సి.పి.వో. జె.విజయలక్ష్మి, డి.ఎల్.ఎస్. ఎ. సెక్రెటరీ వి. లక్ష్మీ రాజ్యం, లాండ్ అండ్ సర్వే విభాగ ఎ.డి. జి.పోలరాజు, పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కె.అపర్ణ, ఓ ఎస్ డి ఎం.పూర్ణ చంద్రరావు, ఖజానా శాఖ డి.డి. ఆర్.ఎస్.కె.వి. ప్రసాద్, కలెక్టరేట్ల లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.