భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి..
Ens Balu
4
కలెక్టరేట్
2020-11-05 18:49:30
విజయనగరం జిల్లాలో జలవనరుల ప్రాజక్టుల భూసేకరణ వేగవంతం చెయ్యాలని భూసేకరణ అధికారులను సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ ఆదేశించారు. గురువారం కలక్టరేట్ ఆడిటోరియంలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగర్, జంజావతి, గుమ్మడిగెడ్డ, ఆడారి గెడ్డ, కంచర గెడ్డ, పావురాయి గెడ్డి తదితర భారీ, మధ్యతరహా చిన్ననీటి ప్రాజక్టుల భూసేకరణ పనులపై, జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల భూసేకరణ ఆలస్యం కావడంపై కారణాలను అడుగగా సర్వేయర్లు శిక్షణకు వెళ్లినందున పనులు ఆలస్యం అవుతున్నాయని భూసేకరణ అధికారులు జెసి దృష్టికి తీసుకువచ్చారు. సర్వేయర్లపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని సర్వే శాఖ సహాయ సంచాలకులు పోలరాజును ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన చోట అవార్డుల విచారణ చేసి వెంటనే అవార్డు జారీ చెయ్యాలన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించుటకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు చెల్లించవలసిన పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డిఓ భవానిశంకర్, భూసేకరణ ఉప కలక్టర్లు జయరామ్, బాలా త్రిపుర సుందరి, సాల్మన్ రాజ్, వెంకటేశ్వరరావు, జాతీయ రహదారుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.