7న మెగా వర్చువల్ అధాలత్..


Ens Balu
3
Srikakulam
2020-11-05 19:04:11

శ్రీకాకుళం జిల్లాలో మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ పై గురు వారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వివరాలను ప్రకటించారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 320 క్రింద రాజీపడదగ్గ కేసులు, నెగోషియబుల్ ఇన్స్టుమెంటు చట్టం సెక్షన్ 138 క్రింద చెక్ బౌన్సు కేసులు, అన్ని సివిల్ కేసులు, మోటారు వాహన చట్టం క్రింద కేసులు, బీమా, చిల్లర కేసులు తదితర కేసులను ఇందులో పరిష్కరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రాజీపడదగ్గ 368 క్రిమినల్ కేసులు గుర్తించడం జరిగిందని, వెయ్యి సివిల్ కేసులు గుర్తించామని చెప్పారు. ఇందుకు జిల్లా కేంద్రంలో 4 కోర్టు బెంచులు ఏర్పాటు చేసామని, అందులో రెండు బెంచ్ లకు సీనియర్ సివిల్ జడ్జిలు, రెండు బెంచ్ లకు జూనియర్ సివిల్ జడ్జిలు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి కోర్టులో న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులుగా ఉన్న న్యాయమూర్తులు కోర్టు బెంచులను నిర్వహిస్తారని చెప్పారు. క్షణికావేశాలతో కొన్ని సమయాల్లో కోట్లాటలు జరిగి ఉండే అవకాశం ఉందని, కొద్ది రోజుల అనంతరం పరివర్తన వచ్చినప్పటికి మానసిక ఘర్షణతో రాజీ చేసుకునే పరిస్ధితి ఉండదని ఆయన అన్నారు. అటువంటి వారికి లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. లోక్ అదాలత్ లో సత్వర పరిష్కారం లభించడమే కాకుండా లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు తుది తీర్పుగా ఉంటుందని, అప్పీలు చేసుకునే అవకాశం లేదని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. పేద ప్రజలు అధికంగా ఉన్న శ్రీకాకుళం వంటి జిల్లాలో కోర్టు వివాదాల్లో చిక్కుకుని కోర్టులకు హాజరు కావడానికి ప్రయాణపు ఖర్చులు, ఇతర ఖర్చులు భరించుకోవడం, కూలి చేసుకునే రోజును వదులుకోవడంతోపాటు వ్యయప్రసాయసలకు లోను కావడం జరుగుతుందని అన్నారు. అనవసరపు ఖర్చులతో పాటు అశాంతి, మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతుందని పేర్కొంటూ ఆమోదయోగ్యమైన రాజీ వలన ఉభయులకు సమన్యాయం చేకూరుతుందని వివరించారు. సత్వరం కేసులు పరిష్కారం జరుగుటకు లోక్ అదాలత్ అత్యంత ఉత్తమ మార్గమని చెప్పారు. రాజీపడదగ్గ 18 వేల పెండింగు కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. వీటన్నింటిని ఉభయులు రాజీ చేసుకునే అకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్ లో సత్వర పరిష్కారాన్ని ప్రోత్సహించుటకు కోట్ల విలువగల సివిల్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశంతోపాటు, కోర్టు ఫీజుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వాపసు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు స్వయంగా వచ్చి కేసులను రాజీ చేసుకోవచ్చని, లేదా ఆన్ లైన్ ద్వారా జరిగే వర్చువల్ లోక్ అదాలత్ లో పాల్గొనవచ్చని ఆయన పేర్కొంటూ దీనిని సద్వినియోగం చేసుకుని ఇరువర్గాలు మానసిక ప్రశాంతత పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.అన్నపూర్ణ, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.