9న జాతీయ న్యాయసేవాధికార దినోత్సవం..
Ens Balu
3
Srikakulam
2020-11-05 19:08:14
జాతీయ న్యాయసేవాధికార దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. జాతీయ న్యాయసేవాధికార దినోత్సవంపై గురు వారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వివరాలు ప్రకటించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సామాన్యుడికి కూడా సమ న్యాయం అందాలని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే న్యాయసేవాధికార సంస్ధలను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయ సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి, మహిళలు, చిన్నారులు, కార్మికులు, దివ్యాంగులు, విపత్తుల వలన ఇబ్బందులకు గురి అయ్యేవారు, మానసిక ఆరోగ్యం లేని వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు లోపు ఉన్నవారికి రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం సమ న్యాయం అందాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తూ లోక్ అదాలత్ లో కోర్టు ఫీజు మినహాయింపు ఉంటుందని, న్యాయవాది ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. వ్యాజ్యాలు న్యాయస్ధానికి వచ్చేటప్పుడు న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్ధిక స్ధోమత లేని వారికి ఇది కష్టతరమని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 39 – ఏ ప్రకారం పేదలకు ఉచిత న్యాయం అందించుటకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచిస్తూ న్యాయసేవాధికార సంస్ధలను నెలకొల్పడం జరిగిందని ఆయన వివరిచారు. ఈ మేరకు జాతీయ న్యాయసేవాధికార దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజలకు న్యాయ విజ్ఞానాన్ని అందించుటకు శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి న్యాయాధికారి న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నారని, ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారని చెప్పారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను సైతం నవంబరు 9వ తేదీన నిర్వహించాలని, అయితే రెగ్యులర్ కోర్టు పనిచేస్తుండటంతో 7వ తేదీన నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఆర్జీలను రాయుటకు రిటైనర్ లాయర్ కోర్టులలో ఉంటారని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. న్యాయసేవాధికార సంస్ధల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రతి కోర్టులో న్యాయసేవాధికార సంస్ధ విభాగం ఉంటుందని చెప్పారు. ఏ ఒక్కరూ దుర్వినియోగం చేసుకోరాదని, దుర్వినియోగం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.అన్నపూర్ణ, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.