ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేయాలి..
Ens Balu
2
Kakinada
2020-11-05 19:10:03
కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ), రంగరాయ వైద్యకళాశాల (ఆర్ఎంసీ)లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వీలైనంత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కాన్నారు. మొత్తం 14 కోర్సులు లేదా ట్రేడ్‌ల విద్యార్థులున్న ఐటీఐని ఎక్కడికీ తరలించకుండానే ఆర్ఎంసీని విస్తరించాల్సిన అవసరముందన్నారు. రెండు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల ద్వారా గరిష్ట ప్రయోజనం చేకూరేలా నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, ఆర్డీవో ఏజీ చిన్నకృష్ణలతో కలిసి కలెక్టర్.. ఐటీఐ, ఆర్ఎంసీలను సందర్శించారు. తొలుత ఐటీఐ ప్రాంగణంలోని వెల్డర్, మోటార్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్; రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర ల్యాబ్‌లను నిశితంగా పరిశీలించారు. మొత్తం 15.76 ఎకరాల స్థలంలో ఉన్న నిర్మాణాల గురించి ఐటీఐ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల స్కెచ్‌లను పరిశీలించారు. ఖాళీ స్థలాల గురించి ఆరా తీశారు. ప్రాంగణంలో ప్రభుత్వ ఐటీఐతో పాటు జిల్లా ఉపాధి కార్యాలయం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, 200 పడకల సామర్థ్యంగల ఎస్‌టీ వసతిగృహం, 33కేవీఏ సబ్‌స్టేషన్ ఉన్నట్లు ఐటీఐ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆరెకరాల విస్తీర్ణంలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ విభాగాల శిక్షణకు ఉపయోగపడే డ్రైవింగ్ ట్రాక్ ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా కోట్ల విలువైన ల్యాబ్ ఎక్విప్‌మెంట్ ఉందన్నారు. 1947లో ఏర్పాటైన ఐటీఐ నుంచి ఏటా దాదాపు వెయ్యిమంది విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్.. రంగరాయ వైద్యకళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. వైద్యకళాశాల విస్తరణకు సంబంధించి బోధన, అనుబంధ ఆసుపత్రి నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.బాబ్జీ, ఐటీఐ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ ఈజే మోహన్‌రావు, సూపరింటెండెంట్ డి.సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఇ.వసంతలక్ష్మితదితరులు ఉన్నారు.