అన్నవరం దేవస్థానానికి ఐఏఎస్ అధికారి..?
Ens Balu
5
Annavaram
2020-11-07 08:53:47
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ప్రముఖదేవస్థానం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో అక్రమాలు, అవినీతిని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం నడుంబిగించింది.. ఇప్పటివరకూ అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన అధికారులను ఈఓగా కొనసాగిస్తూ వచ్చిన ప్రభుత్వం కొత్తగా ఈ దేవస్ధానానికి ఐఏఎస్ అధికారిని ఈఓగా నియమించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. భారతదేశంలోనే అత్యధిక పురోహితులున్న అన్నవరం దేవస్థానం చరిత్రకెక్కినా, అదేస్థాయిలో అవినీతి వ్యవహారాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. అడ్డదారిలో సిబ్బంది నియామకాలు, ఇష్టం వచ్చినట్టుగా అధికారుల డిప్యూటేషన్లు, ఖర్చులకు తగ్గట్టుగా పనులు కనిపించకపోవడం, వీఐపీల ముసుగులో అధికారులు, సిబ్బంది తరించడం తదితర వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం వీటి నియంత్రణకు ఐఏఎస్ అధికారిని ఈఓగా తీసుకు వస్తే ఇక్కడ దేవస్థానంలో రాజకీయ ఉద్యోగాలకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తుందని చెబుతున్నారు. నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ లో ఈ అంశం చర్చకు రావాల్సి వుండగా ముఖ్యమైన అంశాలను మాత్రమే క్యాబినెట్ లో చర్చించారు. రెవిన్యూశాఖలోనూ, దేవదాయశాఖలోను కొందరు ఉద్యోగులు స్వామివారి పేరుతో ఉద్యోగాలు చేయకుండా ఏళ్లకు ఏళ్లు ఇక్కడే డిప్యూటేషన్లు వెలగబెట్టడంపై అత్యధికంగా ఫిర్యాదులు వెళ్లడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారులు ఈఓగా కొనసాగుతూ వస్తున్నారు. కరోనా వలన భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయినా, తిరుపతి తరువాత ఆ స్థాయిలో భక్తులు వచ్చే ఆలయంగా అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిది పేరుంది. ఆ స్థాయిని నిలబెట్టేందుకు కూడా ప్రభుత్వం ఈ దేవస్థానంలో ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఆలయ అభివ్రుద్ధితోపాటు, మరింత గౌరవం దక్కి, భక్తు సంఖ్యకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ఇక్కడ జరిగే గదుల కేటాయింపులు, పాటవిధానంలో ఇచ్చే పద్దతి, ప్రత్యేక దర్శనాలు, వ్రతాలు చేసే సమయంలో స్వామివారి వ్రతానికి సంబంధించి కాకుండా వారికిచ్చే కానుకల విషయంలోనే పురోహితులు అత్యధిక సమయం కేటాయించడం ఇలా అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వం అన్నవరం దేవస్థానంపై ద్రుష్టిసారించిందని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తరువాత అన్నవరం దేవస్థానానికి ఐఏఎస్ అధికారి నియామకం అయ్యేసూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే స్వామివారి ఆలయ ప్రతిష్ట పెరగడంతోపాటు, ఇక్కడ దొడ్డిదారిన జరిగే వ్యవహారాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట ఖచ్చితంగా పడుతుందని దేవాదాయశాఖ యోచిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..!